కామారెడ్డి పట్టణంలో తీవ్ర విషాదం.. విద్యుదాఘాతంతో ఒకరి వెంట ఒకరు నలుగురు మృత్యువాత

రచ్చబండ : విడవని వర్షం వారి పాలిట శాపమైంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఒకే కుటుంబంలో నలుగురిని పొట్టనబెట్టుకుంది. ఒకరి వెనుక ఒకరుగా నలుగురు విగత జీవులయ్యారు. ఈ ఘటనతో స్థానిక విషాదఛాయలు అలుముకున్నాయి.

జిల్లా కేంద్రంలోని బీడీ వర్కర్స్ కాలనీలో ఉండే ఒకే కుటుంబానికి చెందిన హైమద్ (35), పర్వీన్ (30), మహీమ్ (6), అద్నాన్ (4) విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు.

ఇంట్లో బట్టలు ఆరేసే ఐరన్ వైరుకు విద్యుత్ సరఫరా అయింది. దానిని గమనించిన ఇద్దరు పిల్లలకు తగిలి విద్యుత్ షాక్ కు గురయ్యారు. విలవిల్లాడుతున్ నఆ చిన్నారులను కాపాడబోయిన తల్లిదండ్రులకూ విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు.

హృదయ విదారకమైన ఈ ఘటనపై అక్కడికి వచ్చిన వారు కన్నీటి పర్యంతమయ్యారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.