పోలీసుల కాళ్లుమొక్కి, కన్నీరు కార్చిన మాజీ ఎమ్మెల్యే

రచ్చబండ : కామారెడ్డి జిల్లాలో ఓ మాజీ ఎమ్మెల్యే పోలీసు అధికారుల కాళ్లు మొక్కి వేడుకున్నారు. తమను పార్టీ కార్యక్రమానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని వేడుకున్నారు. అయినా అనుమతివ్వని పోలీసులు అరెస్టు చేశారు.

కామారెడ్డి జిల్లాలో పల్లె గోస- బీజేపీ భరోసా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార, మాజీ ఎంపీ వివేక్ తో కలిసి శుక్రవారం పాల్గొన్నారు. ఈ సమయంలో అదే జిల్లాలోని బూరుగుపల్లిలో బీజేపీ జెండా దిమ్మెను కొందరు కూల్చి వేశారంటూ తెలిసింది.

ఈ విషయం తెలిసిన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి వెళ్లేందుకు బయలుదేరారు. వారిని నిజాంసాగర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అరుణతార రోడ్డుపైనే బైఠాయించారు.

తనను బూరుగుపల్లి వెళ్లనివ్వాలంటూ అరుణతార పోలీసుల కాళ్లు మొక్కి, కన్నీరు పెట్టుకున్నారు. అయినా పోలీసులు వివేక్, అరుణతారను పోలీస్ స్టేషన్ కు తరలించారు.