ప్లాష్.. ప్లాష్.. సంచలన తీర్పు

కామంతో కళ్లు మూసుకు పోయి ఉన్మాదంతో ఊగిపోయి ఓ యువతి ప్రాణాన్ని బలి తీసుకున్న ఆ రాక్షసుడికి ఎట్టకేలకు తగిన శాస్తి జరిగింది. కామాంధులకు ఓ హెచ్చరికగా శుక్రవారం కోర్టు తీర్పునిచ్చింది. గతేడాది ఆగస్టు 15న ఇంజనీరింగ్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడికి కోర్టు శిక్షను ఖరారు చేసింది.

హత్య జరిగిన ఏడాదిలోపే తీర్పు రావడం గమనార్హం. దీనిని అత్యంత అరుదైన కేసుగా కోర్టు గుర్తించింది. కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.

అసలేం జరిగిందంటే?
గతేడాది రమ్య గుంటూరు సమీపంలోని ఇంజినీరింగ్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతోంది. చెల్లెలితో కలిసి తమ నానమ్మ వద్ద గుంటూరులోనే ఉంటోంది. ఇంటర్ తో చదువు ఆపేసిన శశికృష్ణ ఆమెకు మొదట ఇన్ స్టాగ్రాంలో పరిచయమయ్యాడు.

తర్వాత రమ్యంతో స్నేహంగా ఉంటానని నమ్మించాడు. ఆ తర్వాత ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఇక తరచూ వేధించసాగాడు. దీంతో ఆమె అతడి ఫోన్ నెంబర్ ను బ్లాక్ చేసింది. ఈ దశలో రమ్యపై ఆ దుర్మార్గుడు కసి పెంచుకున్నాడు.

తరచూ ఆమెను వేధిస్తూ ఉండేవాడు. ఎంతగా వెంటపడినా అతడిని నిరాకరించింది. తన ప్రేమను నిరాకరించిందన్న కక్షతో రగిలిపోయాడు. ఈ దశలో అతడిలో ఉన్న ఉన్మాద స్వభావం బయటకొచ్చింది. ఆగస్టు 14న రమ్యను చంపాలని రెక్కీ నిర్వహించాడు.

నడిరోడ్డుపై దారుణం
గతేడాది ఆగస్టు 15వ తేదీ.. గుంటూరు నగరం.. ఉదయం 9 గంటల సమయం.. అందరూ చూస్తుండగా నడిరోడ్డులో వెళ్తున్న రమ్యను అడ్డగించాడు ఆ రాక్షసుడు. వెంట తెచ్చుకున్న కత్తితో మెడ, కడుపులో ఆరు చోట్ల పొడిచాడు. ఆ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే నర్సరావుపేట పరారయ్యాడు.

28మంది సాక్షుల వాంగ్మూలం
ఆ తర్వాత పోలీసులు దుండగుడిని అరెస్టు చేశారు. గుంటూరులోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో కేసును విచారించారు. 28 మంది సాక్షుల నుంచి వాగ్మూలం సేకరించారు.

హత్య జరిగిన చోటే ఉన్న సీసీ టీవీలో కూడా ఘటన నమోదైంది. పోలీసు శాఖ సమగ్రమైన దర్యాప్తు చేపట్టి సకాలంలో కోర్టుకు వివరాలు అందజేసింది.

గుంటూరులోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం తుది తీర్పునిచ్చింది. రమ్యను హత్య చేసిన శశికృష్ణకు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. అయితే హైకోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఇవ్వడం గమనార్హం.

ఏ ఆడపిల్లకూ ఇలా జరగొద్దు
మరే ఆడపిల్లకూ తమ బిడ్డ లాగా జరగొద్దని రమ్య తల్లితండ్రులు, చెల్లెలు తీర్పు అనంతరం అభిప్రాయపడ్డారు. అన్యాయంగా రమ్యను చంపేశాడు. ఉరి శిక్ష విధించడం మాకు సంతృప్తిగానే ఉంది. ముఖ్యమంత్రి, పోలీసు శాఖ, జడ్జి, లాయర్లకు ధన్యవాదాలు.. అంటూ వారు తెలిపారు. ఒకవేళ హైకోర్టుకు వెళ్లినా ఇదే శిక్ష పడాలని కోరుకుంటున్నాం.. అని వారు చెప్పారు.