Ikyatha Foundarion.. చిరు వ్యాపారులకు ‘నీడ’నిచ్చిన ఐక్యతా ఫౌండేషన్

  • కడ్తాల్ లో 45 మందికి గొడుగుల పంపిణీ
  • ఎండనుంచి వ్యాపారులకు ఉపశమనం
  • చైర్మన్ సుంకురెడ్డి రాఘవేందర్ రెడ్డిని కొనియాడిన ప్రజలు

రచ్చబండ/నిఘా, ఆమనగల్లు(కడ్తాల్): మండే ఎండలోనూ జీవన పోరంటం చేసే చిరు వ్యాపారులకు నీడనిచ్చారు. ఎండ నుంచి ఉపశమనం కల్పించారు. గొడుగులు ఇచ్చి ఆసరాగా నిలిచారు ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి.

రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో ఎన్నాళ్ల నుంచో ఫుట్ పాత్ పై ఎలాంటి ఆధారం లేకుండా వివిధ రకాల పండ్లు, కూరగాయలు, సామగ్రి అమ్మే చిరు వ్యాపారుల ఇబ్బందులను చూసి చలించిపోయిన రాఘవేందర్ రెడ్డి వారికి నీడనిచ్చే గొడుగులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

అనుకున్నదే తడవుగా ఫౌండేషన్ సభ్యులను పంపి 45 మంది వ్యాపారులకు గొడుగులను పంచిపెట్టించారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో, వానలు కూడా కురుస్తుండడంతో వారికి రక్షణగా ఉండేందుకు ఈ గొడుగులు పంపిణీ చేశామని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు.

పేద ప్రజల పరిస్థితులు తెలిసి, సమాజంలోని ప్రతి ఒక్క వర్గానికి ఏదో విధంగా, ఎంతో కొంత వారి సమస్యల పరిష్కారానికి తమ ఛైర్మన్ రాఘవేందర్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, చిరు వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.