* శంకర్ పల్లిలో విషాద ఘటన
రచ్చబండ, శంకర్ పల్లి: నిత్యం అప్పులబాధలతో ఎందరో తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. ఉపాధి కరువై, కుటుంబ పోషణ బరువై, చేసిన అప్పులు కొరివి పెడుతున్నాయి. ఇలాంటి విషాద ఘటనే రంగారెడ్డ్డి జిల్లా శంకర్ పల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరాంనగర్ కాలనీలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది.
శంకర్పల్లి పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంగోలు పరిసర ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ (45) గత కొన్ని సంవత్సరాలుగా శంకర్పల్లి లో మేస్త్రీ పనిచేస్తూ భవనాలు నిర్మిస్తూ ఉన్నాడు. ఇండ్ల నిర్మాణం చేసే క్రమంలో లేబర్ ను తెచ్చుకునేందుకు 15 లక్షల రూపాయలు కొంతమంది వద్ద అప్పు చేశాడు అందులో నుండి రూ.10 లక్షలు తీర్చగా మిగిలిన 5 లక్షల రూపాయలు వాటి వడ్డీ చెల్లించేందుకు నానా అవస్థలు పడ్డాడు.
5 లక్షల రూపాయలు ఇచ్చిన వ్యక్తి కచ్చితంగా డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తీసుకురావడంతో చేసేది లేక శుక్రవారం తెల్లవారుజామున దాదాపు 5 గంటల సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆయన మృతితో కుటుంబ యజమానిని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో కుటుంబం నిలబడింది అప్పు తీర్చే క్రమంలో కొంత సమయం ఇచ్చినట్లయితే అప్పు తీర్చేవాడని, అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి తీసుకురావడంతో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని కుటుంబ సభ్యులు తెలిపారు శంకర్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.