శంకర్ పల్లిలో ఉప్పొంగిన భక్తిభావం
* భక్తిశ్రద్ధలతో దేవతామూర్తుల విగ్రహ ఊరేగింపు
* హోమాలు, ప్రత్యేక పూజలు చేసిన భక్తులు
రచ్చబండ, శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి పట్టణంలో నూతనంగా నిర్మించిన శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఈనెల 28వ తేదీ నుండి ప్రారంభమయ్యాయి. ఈ విగ్రహ ఉత్సవ ప్రతిష్టాపన కార్యక్రమాలు జూన్ నెల 5వ తేదీ వరకు జరుగుతాయని అయ్యప్ప సేవ సమితి సభ్యులు తెలిపారు. అందులో భాగంగా సోమవారం దేవతామూర్తుల విగ్రహ ఊరేగింపు స్థానిక ఆంజనేయ విఠలేశ్వర దేవాలయం నుండి ఉదయం అయ్యప్ప సేవ సమితి వారు నిర్వహించారు.
ఈ ఊరేగింపు కార్యక్రమంలో కేరళ రాష్ట్రం నుండి వచ్చిన వాయిద్య బృందం తమ కళా కౌశలంతో భక్తులను ఆనంద డోలికలలో ముంచెత్తారు. వాటితోపాటు రకరకాల నృత్య భంగిమలు మహిళలు ప్రదర్శించారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు శ్రీ అయ్యప్ప స్వామి నూతన దేవాలయం వరకు దేవతామూర్తుల ప్రతిమలతో ఊరేగింపు నిర్వహించారు.
అంతకుముందు దేవాలయంలో మహాగణపతి పూజ, పుణ్యాహ వాచనం, అవాహిత దేవతా పూజలు, రుద్ర హోమం, అవాహిత దేవత హోమాలు, శాంతి పౌష్టిక హోమాలు, తదితర పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్, మాజీ సర్పంచ్ ఎస్. ఆత్మలింగం, మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్, చైర్మన్ వెంకట్రామిరెడ్డి, జడ్పిటిసి చేకూర్తా గోవిందమ్మ గోపాల్ రెడ్డి, అయ్యప్ప మాల ధార స్వాములు దండుమోహన్, మిరియాల శ్రీనివాస్, ఎస్. ప్రవీణ్ కుమార్, అడ్వకేట్ విశ్వేశ్వర్, మణి గార్డెన్ శ్రీనివాస్, నరసింహ తదితరులు, పట్టణ వ్యాపారస్తులు, భక్తులు పాల్గొన్నారు.