ఆమనగల్లు అభివృద్ధికి పట్టుమని 10 కోట్లు తెచ్చావా?

* కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు బీజీపీని ఎప్పటికీ నమ్మరు!
* కల్వకుర్తి శాసనసభ్యులు గుర్క జైపాల్ యాదవ్

రచ్చబండ, ఆమనగల్లు: కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు బిజెపి పార్టీని ఆదరించరని అభ్యర్థి తల్లోజు ఆచారి మాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేదని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. ఆమనగల్లు పట్టణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుండి పది కోట్ల రూపాయలు తీసుకొచ్చావా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ కుటుంబ పాలనను తరిమికొట్టాలన్న తల్లోజు ఆచారి మాటలు అతని రాజకీయ అవివేకానికి నిదర్శనం అన్నారు. సోమవారము విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాదారు.

కేంద్ర మంత్రివర్గం నెల రోజులుగా కర్ణాటక రాష్ట్రంలో తిష్ట వేసి అసత్య ప్రచారాలను సృష్టించినా అక్కడి ప్రజలు వారి మాటలను నమ్మలేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా బిజెపి మాయమాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని తేల్చి చెప్పారు. జాతీయ బీసీ కమిషన్ హోదా నిర్వహించిన తల్లోజు ఆచారి ఆమనగల్లు మున్సిపల్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుండి పది కోట్ల రూపాయలు తీసుకొచ్చిన దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నించారు.

ఆచారి రాజకీయ నిరుద్యోగి అని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బిజెపి పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయా అని ప్రశ్నించారు. ముచ్చటగా మూడోసారి తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు.