శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి

* చైర్ పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్
రచ్చబండ, శంకర్ పల్లి: శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని ప్రాంతాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి పట్టణంలోని మనీ గార్డెన్ ఫంక్షన్ హాలులో పోలీస్, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో పట్టణంలోని వ్యాపారస్తులతో ప్రజల భద్రత, నేరాలను అరికట్టుట, ఆరోగ్యం, పట్టణ పరిశుభ్రత తదితర అంశాలపై అవగాహన సదస్సు జరిగింది.

ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో నివసించే ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. చెత్తాచెదారం ఎక్కడపడితే అక్కడ వేయకుండా ఒకచోటే వేసి మున్సిపల్ కు చెందిన చెత్త వాహనాలు వస్తే అందులో వేయాలని చెప్పారు. ఈ సందర్భంగా వార్డుల వారీగా ఏర్పాటు కానున్న ఆర్ఆర్ ఆర్ సెంటర్ ను చైర్పర్సన్ ప్రారంభించారు.

నార్సింగ్ ఏసిపి రమణ గౌడ్ మాట్లాడుతూ శాంతి భద్రత లను ప్రజలు కాపాడాలన్నారు. సమాజంలో జరిగే నేరాలను అరికట్టడానికి ప్రజలు సహకరించాలని కోరారు. వీధులలో, ప్రధాన రహదారులలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ భానూరు వెంకటరామిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ జ్ఞానేశ్వర్, కౌన్సిలర్ శ్రీనాథ్ గౌడ్, కో ఆప్షన్ సభ్యుడు వెంకటరెడ్డి, నాయకులు పార్శి బాలకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.