సాఫ్ట్వేర్ ఉద్యోగి వితరణ

విద్యార్థులకు స్వెటర్స్, టిఫిన్, వాటర్ బాటిళ్లు, నోట్ బుక్స్ వితరణ

రచ్చబండ, శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం పిల్లిగుండ్ల ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బుధవారం మోకిలా పరిధిలోని రిలయన్స్ గ్రీన్ విలేజ్ లో ఉంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి వెంకట్ రావ్ కొంగని వితరణ చాటుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు స్వెటర్స్, టిఫిన్, వాటర్ బాటిళ్లు, లైబ్రరీ బుక్స్,నోట్ బుక్స్, వాల్ చార్ట్స్, పెన్ పెన్సిల్స్, డ్రాయింగ్ బుక్స్, టేబుల్ బుక్స్, జామెంట్రీ బాక్స్ తదితరాలు విద్యార్థుల చదువుకు ఉపయోగపడే సామగ్రిని కుటుంబ సభ్యులతో కలిసి అందించారు.

ఈ సందర్భంగా వరలక్ష్మి, వెంకట్ రావ్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలో ఏదో ఒక ప్రత్యేకమైన నైపుణ్యం దాగి ఉంటుందని, కాబట్టి విద్యార్థులు వారికి ఇష్టమైన సబ్జెక్టులో ఎక్కువ నైపుణ్యాన్ని సంపాదించినట్లయితే భవిష్యత్తులో దాని ఆధారంగా ఉన్నత విద్యను అభ్యసించవలసి ఉంటుందాని అన్నారు. కాబట్టి ఉపాధ్యాయులు చెప్పిన అంశాలను విద్యార్థులు చిన్నతనం నుండే చక్కగా విని అర్థం చేసుకొని భవిష్యత్తులో మంచి ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రులకు,పాఠశాలకు మంచి పేరు తేవాలని కోరడం జరిగింది.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శాతంగారి బాలమణి, సామాజిక కార్యకర్త ఉపాధ్యాయుడు మర్పల్లి అశోక్ మాట్లాడుతూ ప్రభుత్వ బడులలో చదువుకునే విద్యార్థులకు దాతల చేయూత అభినందనీయమని, దాతలు అందించిన సామాగ్రి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వలస కూలీల పిల్లల చదువుకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.

ఈ పిల్లలలో ఎక్కువ పట్టుదల ఉంటుందని, ఇదివరకు పిల్లిగుండ్ల పాఠశాలలో చదువుకున్న వలస విద్యార్థులు ప్రస్తుతం ఎంతోమంది ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని గుర్తు చేయడం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని సేవ కార్యక్రమాలు పేద విద్యార్థుల కోసం చేపట్టాలని దాతలను కోరి వెంకట్రావు,మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు వరలక్ష్మి, ఆనంద్, శ్రీనిధి, రేవారావు, బి రమాదేవి, బి వెంకట్ రత్నం, బి నిఖిత పాల్గొన్నారు.