ఏకపత్నీ వ్రతులు ఎక్కడున్నారో తెలుసా?

• జాతీయ కుటుంబ సర్వేలో వెల్లడైన ఆసక్తికర విషయాలు
శ్రీరాముడిని ఏకపత్నీ వ్రతుడు అంటారు. ఒకే భార్య, ఒకే బాణం కలవాడని పేరుంది. ఇప్పటికీ మన దేశంలో బుద్ధిమంతులను శ్రీరామచంద్రుడితో పోలుస్తుంటారు. మరి అలాంటి ఏకపత్నీవ్రతులున్న ప్రాంతాలు మన దేశంలో ఉన్నాయి. అదీ ఓ సర్వేలో ప్రూవ్ అయింది.

తాజాగా నిర్వహించిన జాతీయ ఆరోగ్య కుటుంబ శాఖ లైంగిక సంబంధాల విషయంపై ఓ సర్వే నిర్వహించింది. 15 ఏళ్ల నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న వారిపై జరిపిన ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక్కో పురుషుడు ఎంత మంది స్త్రీలతో లైంగిక సంబంధం కలిగి ఉన్నాడనే విషయంపై వివరాలు సేకరించారు.

ఆ సర్వేలో ఒకరి కంటే ఎక్కువ మందితో లైంగిక సంబంధం కలిగిన పురుషులున్న దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ ముందుండటం గమనార్హం. ఏపీలో ఒక్కో పురుషుడు నలుగురు మహిళలతో, తెలంగాణలో ఒక్కో పురుషుడు ముగ్గురితో లైంగిక సంబంధం కలిగి ఉన్నట్లు వెల్లడైంది.

అండమాన్ నికోబార్ దీవుల్లో 2.8, కర్ణాటకలో 2.7, తమిళనాడులో 1.8, పుదుచ్చేరిలో 1.2 మంది స్త్రీలతో అక్కడి పురుషులు లైంగిక సంబంధం కలిగి ఉన్నట్లు ఆ సర్వేలో తేలింది. అయితే కేరళ, లక్షదీప్ దీవుల్లో జీవిత కాలంలో ఒక్కరితోనే అక్కడి పురుషులు లైంగిక సంబంధం కలిగి ఉన్నట్లు తేలింది.