సత్యసాయి జిల్లాలో ఘోర దుర్ఘటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీసత్యసాయి జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. ఓ ఆటోలో కూలీలు పనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 మంది సజీవదహనమయ్యారు. మరో ఇద్దరు చికిత్స పొందుతూ కన్నుమూశారు. ప్రమాదం నుంచి ఒకరు బయటపడ్డారు.

జిల్లాలోని తాడిమర్రి మండలం గుడ్డంపల్లి గ్రామానికి చెందిన 10మంది కూలీలు పార్నపల్లి గ్రామ పరిధిలో జరిగే వ్యవసాయ కూలి పనులకు బయలుదేరారు. అదే మండలంలోని చిల్లకొండయ్య పల్లి గ్రామ సమీపంలోకి వెళ్లగానే విద్యుత్ హైటెన్షన్ వైర్లు తెగిపడి ఆటోపై పడ్డాయి. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.

ఈ ప్రమాదంలో 10 మంది కూలీలు సజీవ దహనమయ్యారు. ఘటనా స్థలంలో 8మంది మృతిచెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు. ఆటో డ్రైవర్ ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు స్థానికులు తెలిపారు.

ఈ ప్రమాదంలో మృతులంతా గుడ్డంపల్లి గ్రామానికి చెందిన ఒక కుటుంబానికి చెందిన వారిగా స్థానికులు చెప్తున్నారు. వారంతా రెక్కాడితే డొక్కాడని కూలీలు. వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.