నల్లగొండలో సైకో కానిస్టేబుల్ వికృత చేష్టలు.. స్థానికుల దేహశుద్ధి?

నల్లగొండ జిల్లాలో ఓ సైకో కానిస్టేబుల్ వికృత చేష్టలు బయట పడ్డాయి. అతని దుష్ట చర్యలను పసిగట్టిన స్థానికులు కొందరు పట్టుకొని దేహశుద్ధి చేసి స్థానిక పోలీసులకు అప్పగించారని తెలిసింది. ఘటనపై విచారణ జరుగుతోంది. ఇతర మీడియాలో వచ్చిన కథనాల మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

నార్కట్ పల్లి మండలానికి చెందిన అతను 2010 బ్యాచ్ సివిల్ పోలీస్ కానిస్టేబుల్ గా విధుల్లో చేరాడు. శిక్షణ అనంతరం నల్లగొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులోని ఓ కాలనీలో తన భార్యా, పిల్లలతో అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు.

అతనికి ఉన్నతాధికారులు జిల్లా కేంద్రానికి సమీపంలోని ఓ నియోజకవర్గ కేంంద్రంలో ఇటీవలే ఓ ప్రత్యేక విభాగంలో విధులు అప్పగించారు. అతడు పొద్దంతా పోలీస్ విధులు నిర్వహిస్తాడు. రాత్రయిందంటే చాలు అతనిలోని సైకో బయటకొస్తాడు. రాత్రి సమయాల్లో ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకొని వారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటాడు.

ఆ నియోజకవర్గ కేంద్రంతో పాటు నల్లగొండ పట్టణంలోని వివిధ కాలనీలలో సుమారు 50 మంది మహిళల పట్ల ఆ సైకో అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిసింది. అయితే వారంతా కేసు పెట్టడానికి వెనకంజ వేసినట్లు తెలిసింది.

తెల్లవారు జామున రోడ్డు వెంట వాకింగ్ కు వెళ్లే మహిళలను వెనుక నుంచి పట్టుకోవడం, ఇళ్ల ముందు ముగ్గులు వేసే, ఇతర పనుల్లో ఉండే మహిళను తన చేతులతో అసభ్యకరంగా తాకేవాడు. కొన్నిసార్లు స్థానిక పోలీసులు గుర్తించినా తనకున్న పరిచయాలతో కేసు కాకుండా బయటపడ్డాడు.

నల్లగొండ పట్టణంలో ఓ కాలనీలో ఉండే మహిళల ఫొటోలను మార్పింగ్ చేసిన పోస్టర్లను మరో కాలనీలోని గోడలకు మంగళవారం తెల్లవారుజామున 4గంటలకు అంటించేందుకు యత్నించాడు. ఈ విషయాన్ని పసిగట్టిన బాధిత కుటుంబాల సభ్యులు, ఆ ఇంటి యజమానికి దుండగుడు పట్టుబడ్డాడు. దీంతో మనోడి బాగోతం బయటపడింది.

ఆ ఇంటి యజమానితో పాటు బాధితుల కుటుంబ సభ్యులు కలిసి ఆ దుండగుడికి దేహశుద్ధి చేశారు. నిందితుడితో పాటు అతడి బైక్ ను స్థానిక పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. ఈ మేరకు ఆసైకో కానిస్టేబుల్ పై విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. త్వరలో కేసు వివరాలు వెల్లడించే అవకాశాలున్నాయి.