సమీకృత సాగుపై శాస్త్రవేత్తలు, నిపుణులతో 17న సూర్యాపేటలో రైతు సదస్సు

• ఆధునిక వ్యవసాయ పనిముట్ల పంపిణీ
• 18 రకాల కూరగాయల విత్తనాల పంపిణీ
• ఉత్తమ రైతు దంపతులకు రైతుమిత్ర అవార్డులు
• ముఖ్య అతిథిగా హాజరు కానున్న మంత్రి జగదీష్ రెడ్డి

రచ్చబండ : ఈ నెల 17న సూర్యాపేట జిల్లా కేంద్రంలో కేవీకే రైతుమిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో సమీకృత వ్యవసాయంపై అవగాహన సదస్సును ఏర్పాటు చేస్తున్నట్లు ఫౌండేషన్ ఫౌండర్ పగడాల ఉపేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక మన్నెం సదశివారెడ్డి ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి హాజరుకానున్నారని ఆయన పేర్కొన్నారు.

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న ఈ సదస్సులో శాస్త్రవేత్తలు, వ్యవసాయరంగ నిపుణులు అధికారులతో పాటు రైతులు పాల్గొననున్నట్లు తెలిపారు. సదస్సులో ఆధునిక వ్యవసాయ పనిముట్ల ప్రదర్శన, వ్యవసాయదారులు పండించిన పంటలను ప్రదర్శించడంతో పాటు ఔత్సాహిక కూరగాయ పెంపకం దారులకు 18 రకాల విత్తనాలను అందజేయనున్నట్లు తెలిపారు.

అంతే గాకుండా ఉత్తమ రైతు దంపతులకు రైతుమిత్ర-2022 అవార్డులతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలలో విశేష కృషి చేసిన వారికి రైతు సేవారత్న అవార్డులను అంద జేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.