‘శ్రీశైలం’ నిర్వాసితులందరికీ న్యాయం చేస్తాం

• కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి
• 98 జీవో నియామకపత్రాలు అందజేత

రచ్చబండ, చిన్నంబావి: నిర్వాసితులకు తగు న్యాయం చేస్తామని వనపర్తి జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి హామీ ఇచ్చారు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో 98 జీవో శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులకు సొంత జిల్లాలో విధులు నిర్వహించడానికి నియామక పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు.

అంతకుముందు ఆంధ్రప్రదేశ్ లో లస్కర్లుగా నియమితులై విధులు నిర్వహిస్తుండేవారు ఎమ్మెల్యే ప్రోత్సాహంతో సొంత జిల్లాలోకి సొంత మండలాలకు రావడం జరిగిందని నిర్వాసితులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లస్కర్లుగా నియమకం పొందిన వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించడానికి ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేస్తామని ఇంకా మిగిలిన నిర్వాసితులకు కూడా ఉద్యోగాలు కల్పించే విషయాన్ని సీఎం కెసిఆర్.మంత్రి కేటీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లి వారి సూత్రప్రాయంగా అంగీకరించారని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సొంత జిల్లాకు రప్పించడం జరిగిందని అన్నారు.

ఒక్కసారి ఇంతమందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం గొప్ప విషయమని, ఇందులో మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఎంతో సహకారం ఉందని అన్నారు. చిన్నంబావి మండలానికి భవిష్యత్తులో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు. అచ్చంపేట, కొల్లాపూర్, చిన్నంబావి మీదుగా అల్లంపూర్ వరకు డబల్ రోడ్డు నిర్మాణాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.

అలాగే చిన్నంబావికి ప్రభుత్వ హాస్పిటల్ త్వరలో రాబోతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సోమేశ్వరమ్మ, జడ్పీటీసీ వెంకట రమణమ్మ, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.