- రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
నిఘా. శంకర్ పల్లి: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మానవతా విలువలు గల ముఖ్యమంత్రి అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కొనియాడారు. శుక్రవారం శంకర్ పల్లి మండలంలోని మోకిలా- టంగుటూరు గ్రామాల మధ్య మూసీ నదిపై రూ.12.90 కోట్లతో నిర్మిస్తున్న ఓవర్ బ్రిడ్జి పనులకు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం టంగుటూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన ఊరు- మనబడి కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. గ్రామంలో జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేదల పాలిటి ఆశాజ్యోతి అని అన్నారు. రైతులను, వృద్ధులు, వితంతువులను ఆదుకుంటున్నారని తెలిపారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టని సంక్షేమ పథకాలను కేసీఆర్ రాష్ట్రంలో ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారని కొనియాడారు. కాంగ్రెస్, బీజేపీలు ముఖ్యమంత్రి కేసీఆర్ పై లేనిపోని ఆరోపణలు చేస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య నియోజకవర్గ ప్రజలకు అన్ని సౌకర్యాలు చేకూర్చడానికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. మూసీ నదిపై ఆరు ఓవర్ బ్రిడ్జిలను సీఎం కేసీఆర్ నుండి మంజూరు చేయించారని, అందులో భాగంగానే ఈరోజు మోకిలా, టంగుటూరు బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పాలించారని, వారికి ఈ బ్రిడ్జి నిర్మాణాలు చేపట్టాలని ఆలోచనలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం మనకు పనిచేసే ముఖ్యమంత్రి ఉన్నారని, అందుకోసం రాబోయే ఎన్నికల్లో, బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శంకర్ పల్లి ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, జడ్పిటిసి చేకూర్త గోవిందమ్మ, టంగుటూరు గ్రామ సర్పంచ్ గోపాల్, రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు, మిర్జాగూడ సర్పంచ్ గౌండ్ల రవీందర్ గౌడ్, శంకర్ పల్లి ఏఎంసీ చైర్మన్ పాపారావు, వైస్ చైర్మన్ కురుమ వెంకటేష్, పీఎసీఎస్ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి, శంకర్ పల్లి మున్సిపల్ కౌన్సిలర్ శ్రీనాథ్ గౌడ్, మండల, మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గోపాల్, వాసుదేవ్ కన్నా, ఉపాధ్యక్షుడు రాఘవేందర్ రెడ్డి, యూత్ అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి, బొల్లారం వెంకటరెడ్డి, చేకూర్త గోపాల్ రెడ్డి, జి.గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.