Kalvakurthy MLA jaipalyadav.. కేంద్రంలో బీజేపీ రాక్షస, అరాచక పాలన

– 3న ఆమనగల్లులో మంత్రి కేటీఆర్ పర్యటన

– 15 కోట్ల రాష్ట్ర నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం

– బీఅర్ఎస్  ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి

– ఎమ్మెల్యే జైపాల్ యాదవ్

రచ్చబండ, ఆమనగల్లు : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాక్షస, అరాచక పాలన సాగిస్తున్నదని కల్వకుర్తి ఎమ్మెల్యేగా జైపాల్ యాదవ్ ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఆమనగల్లు  మున్సిపాలిటీ పట్టణం నిర్లక్ష్యానికి గురై అభివృద్ధిలో వెనకబడిన కారణంగా ఎమ్మెల్యేగా తన కర్తవ్యంగా భావించి మున్సిపాలిటీ అభివృద్ధికి 15 కోట్లతో పలు అభివృద్ధి పనులు మంజూరు చేయించినట్టు తెలిపారు. ఏప్రిల్ 3న రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుతో కలిసి ఆయా పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిపారు.  

నియోజకవర్గంలోని అన్ని మండలాల పరిధిలో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కింద రూ.100 కోట్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను,   మంత్రి కేటీఆర్ ని తాను కోరినట్లు తెలిపారు.  ఆమనగల్లు మండల కేంద్రంలో ప్రభుత్వ కళాశాల  భవనానికి రూ.2.50 కోట్లు మంజూరయ్యాయని వివరించారు. కళాశాల ప్రాంగణంలో ఉన్న తొమ్మిది ఎకరాల భూమి అన్యాక్రాంతం కాకుండా అదనపు నిధులు ఇవ్వాలని తాను కోరినట్లు తెలిపారు.

అదేవిధంగా ఆమనగల్లులో డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ దవాఖాన నూతన భవనం కొరకు పూర్తిగా నిధులు అందించాలని ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, ముఖ్యమంత్రి కేసీఆర్ ని కోరానని చెప్పారు. ఆమనగల్లు మున్సిపాలిటీ, మండల అభివృద్ధికి పార్టీలకతీతంగా అందరూ సహకరించాలని కోరారు. అనంతరం 3న బిఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొననున్నట్లు తెలిపారు.

ఈ సమ్మేళనం నిర్వహించడానికి ముఖ్య కార్యకర్తలతో కమిటీలు వేశామని, ఈ కమిటీలు ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయడానికి పనిచేస్తారన్నారు. ఈ సమ్మేళనానికి రంగారెడ్డి జిల్లా, మంత్రులు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు అందరూ పాల్గొంటారని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వివక్షను తిప్పికొట్టే విధంగా ఈ సమ్మేళనం నిర్వహిస్తామని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. దేశంలో బిజెపి ప్రభుత్వం విడదీసి పాలించు అనే సిద్ధాంతాన్ని పాటిస్తుందని ఎద్దేవా చేశారు. నల్లధనాన్ని బయటకి తెస్తా అన్న మోడీ దేశ సంపదను ఆదాని అంబానీలకు, బడా వ్యాపారులకు దోచిపెడుతున్నాడన్నారు. హైదరాబాద్ లాంటి విశ్వ నగరం అభివృద్ధిని బిజెపి ప్రభుత్వం అడ్డుకున్న ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. 125 కోట్ల రూపాయలు జీఎస్టీ ద్వారా తెలంగాణకు ఇవ్వాలి కానీ ఇప్పటివరకు ఒక్క రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవని విమర్శించారు.

దేశాన్ని అభివృద్ధి చేయకుండా కేవలం అరాచక పాలన సాగిస్తున్నారని ఆరోపించారు.   అదేవిధంగా ఏప్రిల్ మూడవ తేదీన జరిగే ఆత్మీయ సమ్మేళనాన్ని బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కోరారు. అనంతరం ఏప్రిల్ 3న జరిగే ఆత్మీయ సమ్మేళనం సభా ప్రాంగణం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు.