చూపు లేకున్నా కళ్లు బైర్లు కమ్మే ఫలితాలు సాధించింది..

రచ్చబండ, ఆన్ లైన్ ప్రతినిధి : అన్ని అవయవాలు సరిగా ఉండి అత్తెసరు మార్కులతోనే ఎందరో సరి పెట్టుకుంటుంటారు. ఎన్నో అవకాశాలు ఉన్నా పాస్ మార్కులొస్తే చాలనుకునే వారే అందరూ.. కానీ అందరి కంటే మేటిగా ముందుండాలనుకునే వారు కొందరే. కానీ దృష్టి లోపం ఉన్నా అందరి దృష్టీ తనపై ఉండేలా సత్తా చాటింది ఓ అమ్మాయి.

కేరళ రాష్ట్రానికి చెందిన హన్నా ఆలిస్ సిమోన్ అనే బాలికకు పుట్టుకతోనే అంధత్వం ఉంది. స్కూల్ చదివే సమయంలో ఆమెను తోటి పిల్లలెందరో హేళన చేసేవారు. దానినే పట్టుదలగా మలుచుకుందో.. తన వైకల్యాన్ని అధిగమించాలని అనుకుందో కానీ చదువులోనే కాదు వివిధ రంగాల్లో మేటి కావాలని మాత్రం నిర్ణయించుకుంది.

ఆమె పట్టుదల ఫలించింది. సింగర్ గా, మ్యూజిక్ కంపోజర్గా, యూ ట్యూబర్ గా, మోటివేషన్ స్పీకర్గా 19 ఏళ్లలోపుగానే రాణించసాగింది. ఆయా రంగాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది.

ఇటీవలే సీబీఎస్సీ 12వ తరగతి ఫలితాల్లో హన్నా సిమోన్ 500 మార్కులకు గాను 496 మార్కులు సాధించి, టాపర్ గా నిలిచింది. అమెరికాలో సైకాలజీ చదివేందుకు పూర్తి స్కాలర్ షిప్పునకు ఎంపికై విశేష ప్రతిభ చాటింది.

‘‘చిన్నతనంలోనే నేను ఎన్నో వేధింపులకు గురయ్యా. తోటి విద్యార్థులు నన్ను దూరంగా ఉంచారు. కానీ జీవతంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటానని నాకు తెలుసు. కాబట్టి చిన్నతనం నుంచే వాటిని ఎదుర్కొంటూ వచ్చా. నిజంగా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ గాడ్’’ అని హన్నా సిమోన్ ఫలితాల తర్వాత ఇలా తన మనోగతం తెలిపింది.