సూర్యాపేట జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్

ఎన్నికల రణగొణ ధ్వనుల్లో వలసల పదనిసలు అంతటా మొదలయ్యాయి. ఈ దశలో సూర్యాపేట జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఒకే మున్సిపాలిటీకి చెందిన ముగ్గురు అధికార పార్టీ కౌన్సిలర్లు తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు.

జిల్లాలోని హుజూర్ నగర్ నియోజకవర్గంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా ఎన్నికల బాణాలు ఎక్కు పెట్టుకున్నాయి. నేరేడుచర్ల మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్ ఆదివారం హైదరాబాద్ లోని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెల్లారేలోగా అంటే సోమవారమే టీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

నేరేడుచర్ల మున్సిపాలిటీకి చెందిన 3వ, 4వ వార్డుల కౌన్సిలర్లు షెహనాజ్ కరీముల్లా, షేక్ భాషా, 6వ వార్డు కౌన్సిలర్ తాళ్లూరి సాయిరాం టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నల్లగొండ ఎంపీ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

నువ్వొకటంటే నేను మూడంటా.. అన్న రీతిలో సాగిన ఈ చేరికల పర్వం ఎక్కడికి దారితీస్తుందోనని విశ్లేషకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ పరిస్థితుల్లో హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఎవరి పంత నెగ్గుతుందో వేచి చూడాలి మరి.