ప్రేమ కోసమై నదినే దాటెను పాపం ఆ యువతి

ఇదేంది.. పాట మారింది.. అనుకుంటున్నారా.. అదే మరి.. ప్రేమ కోసం ప్రియుడే వెళ్లాలా.. ప్రియురాలు ప్రియుడున్న కాడికి వెళ్లకూడదా.. మరిక్కడ అదే జరిగింది. ప్రేమించిన వాడి కోసం ఆ యువతి దేశ సరిహద్దులే దాటి నదినే అవలీలగా ఈదుతూ ప్రియుడి చెంతకు చేరుకుంది.

బంగ్లాదేశ్ దేశానికి చెందిన 22ఏళ్ల యువతి పేరు కృష్ణ మండల్. ఆమెకు మనదేశంలోని కోల్ కతాకు చెందిన అభిక్ తో ఫేస్ బుక్ లో పరిచయమైంది. అది కాస్తా ప్రేమంగా మారింది. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. మరి కలిసేదెలా.. అని అనుకుంటూ కూర్చోలేదు. పాస్ పోర్టు లేకున్నా ప్రియుడి చెంతకు చేరాలని నిశ్చయించుకుంది.

ప్రేమికుడిని చేరుకోవాలనే బలమైన కోరికతో ఉన్న ఆ బంగ్లా యువతి దుస్సాహసమే చేసింది. కోల్ కతాలో ఉండే ప్రియుడి కోసం భారత్, బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న నదిని గంటపాటు ఈదుకుంటూ దాటి మనదేశంలోకి అడుగు పెట్టింది.

ఆ యువతి మరో సాహసానికీ వెరవలేదు. రాయల్ బెంగాల్ టైగర్స్ కు ప్రసిద్ధి చెందిన సుందర్ బన్ మడ అడవుల గుండా ధైర్యంగా ఒంటరి ప్రయాణం సాగించింది. ఎలాగైతేనేమి ప్రియుడి చెంతకు చేరింది.
మూడు రోజుల క్రితం ఇక్కడికి వచ్చిన ఆ యువతి అభిక్ ను కోల్ కతాలోని కాళీఘాట్ ఆలయంలో పెళ్లి చేసుకొంది.

అయితే భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించడంపై సమాచారం అందుకున్న అక్కడి పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఆమెను బంగ్లాదేశ్ హైకమిషన్ కు అప్పగించే అవకాశాలున్నాయని అంటున్నారు.

ఏదైతేనేమి ప్రేమ కోసం ఆ యువతి ఎన్నో సాహసాలు చేసింది. ప్రియుడి చెంతకు చేరి మరీ పెళ్లి చేసుకొని అనుకున్నది సాధించింది. అందుకే ప్రేమ కోసమై నదినే దాటెను పాపం ఆ యువతి.. అని పాట పాడాలనిపించింది.