ఎగువ సభలో మన పెద్దలు 10మంది!

పార్లమెంట్ ఎగువ సభలో తెలంగాణ పెద్దల సంఖ్య పదికి పెరిగింది. దీంతో తెలంగాణ వాణిని వినిపించే వారి సంఖ్య పెరిగింది. గతంలో మనవాళ్లు ఏడుగురు రాజ్యసభ సభ్యులే ఉండేవారు. ఇతర రాష్ట్రాల ప్రాతినిథ్యంతో ఆ సంఖ్య పెరిగింది.

టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు, రాజ్యసభలో ఆ పార్టీ ఉపనేత కేఆర్ సురేశ్ రెడ్డి, సంతోష్ కుమార్, బడుగుల లింగయ్యయాదవ్ ఉన్నారు. ఇటీవలే జరిగిన ఉప ఎన్నికలో గెలిచిన వద్దిరాజు రవిచంద్ర తాజాగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.

అదే విధంగా మరో రెండు స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో దీవకొండ దామోదర్ రావు, బండి పార్థసారథిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. దీంతో రాష్ట్ర కోటా ప్రకారం ఏడుగురి సభ్యులతో పరిపూర్ణం కానుంది. వీరంతా టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం.

ఏపీ నుంచి తెలంగాణకు చెందిన బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య, నిర్మల్ జిల్లాకు చెందిన ప్రముఖ న్యాయవాది నిరంజన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కోటా నుంచి వైఎస్సార్ సీసీ పార్టీ ప్రతిపాదన మేరకు ఎంపిక కానున్నారు.

మంగళవారమే బీజేపీకి చెందిన డాక్టర్ కే.లక్ష్మణ్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఎంపిక కూడా ఏకగ్రీవం కానుంద. వీరంతా కలిసి 10 మంది తెలంగాణ నుంచి పెద్దల సభలో తమ గళాన్ని వినిపించనున్నారు. దీంతో మన ప్రాతినిథ్యం పెరిగిందన్న మాట.