అస్తిత్వ పోరాటాలకు వెన్నుదన్ను నా తెలంగాణ

అమ్మ పురిటినొప్పుల బాధ ఏమిటో ఆ దేవుడికేమి తెలుసు.. అని కవి ప్రశ్నించినట్లు నా తెలంగాణ గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నెనో గాయాలు చవిచూసింది. మరీ 20వ శతాబ్దం మొదటి అర్ధ శతాబ్దం నుంచి యావత్ తెలంగాణ సమాజం ఆ బాధలు అనుభవిస్తూనే ఉంది. ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక వ్యాసం

దొరల యేలుబడిని, జమీందారుల, భూస్వాముల దోపిడీని ఎదుర్కొనేందుకు సాయుధపోరాటం ద్వారా రజాకార్లకే ముచ్చెమటలు పట్టించిన ఘనత తెలంగాణ సమాజానిది. ఆనాటి నుంచి కూడా పోరాట యోధులతోబాటు పాట మాట తూట కలిసి ఘడీల పాలనని తరిమికొట్టింది. బండెనక బండికట్టి పదహారు బండ్లు కట్టీ.. వంటి పాటలు ఇక్కడి ప్రజలను ఎంతో ప్రభావితం చేశాయి.

దాశరథి రచనలు చాకలి ఐలమ్మ, షేక్ బందగీ, దొడ్డి కొమురయ్య లాంటివారు భూస్వాములపై తిరుగుబాటు జెండా నెగిరేసినవారు. ముఖ్దూం మొయినొద్దీన్ లాంటి నిజాయీతీ పరులైన పత్రికా రచయితలూ బలైపోయారు. ఎందరెందరో మహానుభావులు, సామాన్యుల బలిదానాల అనంతరం భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఏడాది కాలం తరువాత భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో చేపట్టాక తెలంగాణ విలీనం కావడం జరిగింది. ఇది అంతా ఇరవయ్యే శతాబ్దపు మొదటి అర్ధ భాగం చరిత్ర.

హైదరాబాద్ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కొన్నేళ్లకి 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాలలో భాగంగా హైదరాబాద్, ఆంధ్రా రాష్ట్రాలను కలిపి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పాటు చేసింది అప్పటి భారత ప్రభుత్వం. అదికూడా మూణ్నాళ్ల ముచ్చటలా కొనసాగి నిధులు, నీళ్లు, నియామాకాల్లో తేడాలని చవిచూసిన మేథావులు, విద్యార్థుల నేతృత్వంలో 1969లో ఒక్కసారిగా తెలంగాణ ఉద్యమం ఉప్పెనై ఉవ్వెత్తున ఎగిసింది.

ఇడ్లీ సాంబర్ గో బ్యాక్ అంటూ విద్యార్థులు, తెలంగాణవాదులు లాఠీలకీ తూటాలకెదురెళ్లారు. అయినా కొందరు నాయకుల స్వలాభంతో ఉద్యమం నివురుగప్పిన నిప్పులా తాత్కాలికంగా సద్దుమణిగిందని నాటి అనుభవజ్ఞలు చెబుతున్నారు. నాటి ఉద్యమంలో 369 మంది బలైనారని అంచనా.

తెలంగాణ అస్తిత్వం తెలిపే కొంతమంది మేథావులు, కాళోజీ నాగొడవ.. పుస్తకాలు.. కరపత్రాలు పంచారు. ఆతర్వాత మూడు దశాబ్దాలకు మళ్లీ తెలంగాణ ఉద్యమం తెరపైకి వచ్చింది.

తొంబైలలో తెలంగాణ మహాసభ, తెలంగాణ జనసభ లాంటి సభలు అటు విద్యార్థి లోకాన్నీ ఇటు మేథావుల్నీ ఆలోచింప చేసినయ్ అనటంలో సందేహం లేదు. పాట మాట ఎందర్నో ఆలోచింపజేసి జై తెలంగాణ నినాదంతో సమాజంలో దూసుకెళ్లింది. వలస పాలకులు ఇక్కడి వాళ్లను రాజకీయంగా.. నీళ్లు, నిధులు, నియామాకాల్లో అనేక వ్యత్యాసాలు చూపించారు. తత్ఫలితంగా నిరసనలు ఎన్నో చేసినా ఫలితం లేకపోయింది. అమ్మా తెలంగాణ మా.. అని పాడినందుకు తూటాలు ఎదుర్కొంది పాట.

పాలకుల రాజ్యహింసను పాట ద్వారా గళం విప్పి తూటాలా పేలినందుకు అమానవీయంగా కౄరంగా
ముక్కలు ముక్కలైంది పాట. నిరంతరం పౌర సమాజాన్ని జాగరూకతతో మేల్కొల్పుతూ పాలకులను ఎండగడుతూ హక్కుల బరిలో ముందున్నోళ్లనెందరినో బలిగొన్నది పాలకవర్గం అన్నదాంట్లో సందేహం లేదు.

ఇక ఇరవై ఒకటో శతాబ్దం ఆరంభంలోనే ఎన్నెన్నో గాయాల తెలంగాణకు ఒక రాజకీయ దిక్సూచీ ని చూపించి నోడు ప్రొఫెసర్ జయశంకర్. తన ఒడవని ముచ్చట..ను చెబుతూ ఆరెస్సెస్ నుంచీ ఆరెస్యూ దాకా ఆహ్వానితులేనని విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు, మేథావులను అనేక సదస్సుల ద్వారా మేల్కొల్పి చివరకు ఒక రాజకీయ శక్తికి వెన్నంటి ఉన్నోడు జయశంకర్ సార్.

మరోవైపు విస్తృతంగా విద్యార్థులను గ్రామాలకు తరలండి అన్న నినాదంతో ఉవ్వెత్తునెగిసిపడింది ఉద్యమం. అప్పటి దాకా గ్రామాల్లో ఎక్కువశాతం తెలంగాణ పట్ల నిరాసక్తతగా ఉన్న సమజం నెమ్మదినెమ్మదిగా ఈ శతాబ్దపు రెండో దశకంలో లావాలా ఎగిసిపడింది. తెలంగాణా ధూంధాం ఒకవైపు, సకలజనుల సమ్మె, మిలియన్ మార్చ్, సాగర హారం, సహాయనిరాకరణ, రోడ్లపై వంటావార్పు లాంటివెన్నో సామాన్యులను కదిలించాయి.

ఆనాడు మొత్తం సమాజాన్ని తట్టిలేపింది పాట అని చెప్పొచ్చు. మచ్చుకి..జయజయ హే తెలంగాణ.. నాగేటి సాలల్ల నా తెలంగాణా.. జోహారులూ జోహారులూ అమరులకు జోహార్ వీరులకు జోహార్.. గోదారి గోదారి పారేటి గోదారీ.. అయ్యోనివా.. నువ్వు అవ్వోనివా.. లాంటి పాటల నుంచి, శ్రీకాంతాచారి ఆత్మ బలిదానానికి రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా .. అంటూ కదిలించింది పాట. ఇవేగాక అమ్మా సూడమ్మ బైలెల్లినాదో గోదారమ్మా.. ఆడపిల్లనమ్మా నేనాడపిల్లనమ్మా.. వీరులారా వందనం విద్యార్థీ అమరులారా వందనం.. అనే పాటలు ఎన్నో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోయడమే గాక నిత్యం సామాన్యుల ఆలోచనల్ని పరుగెత్తించినయ్ అనడంలో సందేహం లేదు.

జై బోలో తెలంగాణ జనగర్జనల జడివాన.. అంటూ యువతనీ, మేథావుల్నీ ఉరకలేయించింది పాట. వివిధ ప్రజా, కుల, ఉద్యోగ, వృత్తి సంఘాల ప్రతినిధులు రోడ్లపైకి వచ్చారు.

ప్రకటింప బడిన తెలంగాణ అప్పటి పాలకుల కుఠిల నీతికీ కాస్త విరామం తర్వాత అటు రాజకీయ ఇటు కవి గాయకులు, రచయితలు విద్యార్థులు.. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలు నిరంతరం మండుతున్న కొలిమిలా వెలుగుతూంటే సామాన్య జనం పిడికిలెత్తి గొంతెత్తి జై తెలంగాణ నినాదం హోరందుకుంటేనే ఎందరో విద్యార్థుల బలిదానాల తర్వాతే 2014 జూన్ 2న ప్రత్యేక రాష్ట్ర ఆవతరణ దినోత్సవంగా కేంద్రం ప్రకటించింది.

ఇలాంటి త్యాగాల తెలంగాణ మళ్లీ ఇప్పుడు కొన్ని స్వార్థపూరిత శక్తులు ఒక ప్రయోగశాలలా చూడాలనుకుంటే ఈ మట్టి పరిమళం ఊరికేనే వదలదు. ఇక్కడి చెట్టు, పుట్ట, గుట్ట కరచాలనం చేస్తయ్.. కూతకూసి పాటపాడి రాళ్లని సైతం కదిలిస్తయ్.. తస్మాత్ జాగ్రత్త.

సామాజిక ఉద్యమాభివందనాలతో.. జూన్ రెండుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది వసంతాల సందర్భంగా..

యాదిలో…

ఎండీ రంజాన్ బేగ్, కవి, రచయిత,

దేవరకొండ, నల్లగొండ జిల్లా9949552956