పూర్వ విద్యార్థులా మజాకా.. 33 ఏళ్ల తర్వాత ఎలా కలుసుకున్నారో తెలుసా?

రచ్చబండ : 33ఏళ్ల నాటి మురిపెం.. ఆనాటి ఆటా పాటలు.. పలుకరింపుల సందడి.. యోగక్షేమాల ఆనందం.. ఆ ఆవరణంతా నిండుకుంది. అందరూ 33 ఏళ్ల వయసుకు పరకాయ ప్రవేశం చేశారు. చిన్ననాటి చిలిపి చేష్టలు గుర్తు చేసుకున్నారు. గిచ్చుకున్నారు.. గిల్లుకున్నారు.. చాడీలు చెప్పుకున్నారు.. ఇంకేముంది నవ్వుల విరిజల్లులు పూశాయి.

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ లోని రైల్వే స్కూల్ లో చదివిన 1989 బ్యాచ్ పదో తరగతి విద్యార్థుల పూర్వ విద్యార్థల సమ్మేళనం సందర్భమిది. వారంతా ఇప్పటికే ఏడుసార్లు కలుసుకున్నారు. ఈ సారి ప్రత్యేకత చాటుకున్నారు.

ఆనాటి స్కూల్ యూనిఫాం ధరించి అందరూ 33 ఏళ్ల తర్వాత జరుపుకునే సమ్మేళనానికి హాజరవ్వాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా అందరూ యూనిఫాం ధరించి వచ్చారు. వీరిలో మహిళలూ ఉండటం విశేషం. చిన్ననాటి చదివిన రోజుల్లోని మధుర స్మృతులను నెమరు వేసుకున్నారు.