దొంతాన్పల్లి గ్రామానికి చెందిన బర్మల యాదయ్య ఆరోపణ
రచ్చబండ, శంకర్ పల్లి: తన తండ్రిని, అన్నలను మభ్యపెట్టి మొత్తం గుంటన్నర భూమిని శంకర్ పల్లి మండలం గోపులారం సర్పంచ్ పొడవు శ్రీనివాస్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని మండలంలోని దొంతాన్పల్లి గ్రామానికి చెందిన బర్మల యాదయ్య ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో బర్మల యాదయ్య మాట్లాడారు.
దొంతాన్పల్లి గ్రామ శివారులో సర్వేనెంబర్.199లో గుంటన్నర భూమి 180, చదరపు గజాల భూమి తన తండ్రి పేర ఉందని తెలిపారు. ఆ భూమిలో తన వాటా 60 చదరపు గజాలు ఉందని చెప్పారు. గత నెల 16న తన తండ్రిని, అన్నలను మభ్యపెట్టి 180 గజాల స్థలాన్ని సర్పంచ్ శ్రీనివాస్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు.
తన వాటాను కూడా ఆయన అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపించారు. ఇదేమి అన్యాయం అంటే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో పో అంటూ బెదిరిస్తున్నారని, ఆ స్థలంలో తన వాహనాలు నిలబెడితే 100 నెంబర్ పోలీసులకు ఫిర్యాదు చేసి తనను ఇబ్బందుల పాలు చేస్తున్నారని వాపోయారు.
పోలీసులు కూడా తనను బెదిరిస్తున్నారని ఆరోపించారు. తన స్థలంలో గేటును సర్పంచ్ అక్రమంగా నిర్మించుకున్నారని తెలిపారు. ఈ విషయంలో అధికారులు తనకు న్యాయం చేయాలని కోరారు. కాగా ఈ మేరకు తహసీల్దార్ కు ఫిర్యాదు చేశానని చెప్పారు. తమ తాతల కాలం నాటి భూమి అని యాదయ్య తెలిపారు.
సర్పంచ్ పొడవు శ్రీనివాస్ వివరణ
తాను ఎవరి భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోలేదని గోపులారం సర్పంచ్ పొడవు శ్రీనివాస్ వివరించారు. దొంతాన్ పల్లి గ్రామానికి చెందిన బర్మల యాదయ్య 2015 సంవత్సరంలోనే తనకు చెందిన భూమిని అమ్ముకున్నారని తెలిపారు. నేను ఎవరి భూమిని ఆక్రమించి రిజిస్ట్రేషన్ చేసుకోలేదని తెలిపారు. ప్రస్తుతం తాను కొన్న 199 నెంబర్ భూమిలో యాదయ్యకు ఎలాంటి హక్కులు లేవన్నారు. కేవలం తనను బదనాం చేయడానికి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని సర్పంచ్ తెలిపారు.