ముదురు పెళ్లికొడుకు నాకొద్దంటూ నిరాకరించిన యువతి

రచ్చబండ : అది పెళ్లి వేడుక.. అందరూ బంధుమిత్రులు వచ్చి ఆసీనులయ్యారు. వేదికపై హడావుడి.. ఇంతలో పెళ్లి కొడుకు వచ్చి ఎంచక్కా పీటపై కూర్చున్నాడు. ఇంతలో పెళ్లి కూతురు కూడా సిగ్గుతో తలదించుకొని వచ్చి మరో పీటపై కూర్చుంది. ఇక ఇద్దరి చేతులు కలిపి పెళ్లి తంతు షురూ అయింది.

ఈ లోగా ఓరగంటతో వరుడి వైపు వధువు ఓ చూపేసింది. కన్ ఫ్యూజ్.. మళ్లీ చూసింది.. ఆశ్చర్యమేసింది.. ఈసారి తదేకంగా తలెత్తి చూసింది.. హతాశురాలైంది.. ఇంకేముంది తాను మొదట తాను ఫొటోలు చూసిన వ్యక్తి ఈ వరుడు ఒక్కరే కాదని నిర్ధారించుకొని పెళ్లిని నిరాకరించింది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఇటావా జిల్లాలో ఈనెల మొదటి వారంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇటావా పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి అదే జిల్లాలోని భర్తనా ప్రాంతానికి చెందిన ఓ యువతితో వివాహం జరిపేందుకు పెద్దలు నిశ్చయించారు.

తాను చూసిన ఫొటోలో ఉన్నది ఇతను కాదని, ఇతను చాలా ముదురుగా ఉన్నాడని, తనకు ఈ పెళ్లి వద్దని వేడుకలో ఆ వధువు నిరాకరించింది.

మొదట వేరొకరి ఫొటోను తనకు పంపి, ఇప్పడు ఈ ముదురు వ్యక్తితో పెళ్లి చేస్తున్నారని ఆ యువతి, ఆమె కుటుంబ సభ్యులు ఆక్షేపించారు. తాను పెళ్లి చేసుకునేదే లేదని ఆ యువతి భీష్మించుకుని కూర్చుంది.

పెళ్లి వేదిక వద్దే సుమారు ఆరుగంటల పాటు బంధువులు చర్చలు జరిపారు. ఒక కొలిక్కి రాకపోవడంతో వరుడి తరఫు వారు పోలీసులను ఆశ్రయించారు.

పోలీసుల చొరవతో అక్కడే చర్చల ద్వారా ఎవరి వస్తువులు వారు తిరిగి తీసుకున్నారు. పెళ్లి రద్దు కావడంతో వచ్చిన వారు చడీచప్పుడు కాకుండా తమ ఇళ్లకు వెళ్లిపోయారు.