వితరణ శీలికి అరుదైన గౌరవం.. ఎల్సీ గోపయ్యకు కీర్తి కిరీటి జాతీయ అవార్డు

• సామాజిక సేవలో తరిస్తున్న విద్యుత్‌ శాఖాధికారి ఎల్సీ గోపయ్య
• నింగి నేల -మేము సైతం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు
• కరోనా సమయంలో ఎందరికో ఆకలి తీర్చిన అన్నదాత
• మరెందరో అసహాయులకు ఆపన్నహస్తం
• ఎందరినో అక్కున చేర్చుకున్న మానవతావాది

సామాజిక సేవలో తరిస్తున్న నింగి నేల మేము సైతం ఫౌండేషన్‌ ఫౌండర్‌ ప్రెసిడెంట్‌, విద్యుత్‌ శాఖ అధికారి ఎల్సీ గోపయ్యను మరో అవార్డు వరించింది. గతంలో పలు సేవా అవార్డులు దక్కించుకున్న ఆయన తాజాగా కీర్తి కిరీటి జాతీయ టాలెంటెడ్ అవార్డును అందుకున్నారు. వరంగల్‌ నగరంలో జరిగిన సమావేశంలో కన్నతల్లి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆయనకు ఈ అవార్డును బహూకరించారు.

రచ్చబండ, హైదరాబాద్‌ : లకుమళ్ల చిన్న (ఎల్సీ) గోపయ్యది సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం ముకుందాపురం స్వగ్రామం. ఆయన ఇంజనీరింగ్‌ విద్యనభ్యసించి, విద్యుత్‌ శాఖలో అధికారిగా పలు చోట్ల సేవలందించారు. ప్రస్తుతం హైదరాబాద్‌ నగరంలోని ఓ విభాగంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎల్సీ గోపయ్య ఒకవైపు అధికారిగా బాధ్యతలు నెరవేరుస్తూనే మరో వైపు సామాజిక సేవలో తరిస్తున్నారు.

ఈ మేరకు ఆయన సేవలను గుర్తించిన కన్నతల్లి ఫౌండేషన్‌.. వరంగంల్‌ నగరంలో జరిగిన ఓ సమావేశంలో ఎల్సీ గోపయ్యకు కీర్తి కిరీటి జాతీయ టాలెంటెడ్ అవార్డును అందజేసింది. ఈ సందర్భంగా గోపయ్య సేవలను పలువురు వక్తులు, నిర్వాహకులు కొనియాడారు. ఒక వైపు వృత్తిలో రాణిస్తూ విద్యుక్త ధర్మాన్ని నెరవేరుస్తూ ఎందరో అసహాయులకు తనకు తోచిన సాయం చేస్తూ, ఫౌండేషన్‌ పరంగా మరెందరికో స్ఫూర్తిగా గోపయ్య నిలుస్తున్నారని ప్రశంసించారు.

నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఆయన నేడు ఒక ఉన్నతాధికారిగా పనిచేస్తున్నా ఎవరికి ఏ ఆపద వచ్చినా ఇట్టే స్పందిస్తారని తెలిపారు. ఆయన సేవలు జగమంతా వ్యాపించాయని, ఎన్నో వర్గాలకు ఆయన సేవలు అందించారని వివరించారు. కరోనా సమయంలో ఆయన వందలాది మందికి సొంత ఖర్చులతో అందించిన సేవలను గుర్తు చేశారు.

తన సొంత గ్రామమైన ముకుందాపురం, మిర్యాలగూడ, దేవరకొండ, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలోని పలుచోట్ల, జనగామ, కర్నూలు, వరంగల్ జిల్లాల్లో ఎల్సీ గోపయ్య ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఎంతో మందితో శభాష్‌ అనిపించుకున్నారు. ఆయన సేవలకు గాను పలు అవార్డులు అందుకున్నారు.

ముకుందాపురంలో నిత్యావసరాలు అందజేత
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం ముకుందాపురం గ్రామంలో కరోనా సమయంలో సుమారు 400 కుటుంబాలకు నిత్యావసరాలను అందజేసి ఆసరగా నిలిచారు. గ్రామంలోని అన్ని వర్గాలకు చెందిన వారికి నేనున్నాను.. అనే భరోసా ఇచ్చి ఆదుకున్నారు. బియ్యం, పప్పు, నూనె, ఇతర దినుసులతో కూడిన ప్యాకెట్లు అందజేసి గ్రామస్తుల నుంచి ప్రశంసలు పొందారు. ఆయన సేవలను పలువురు మెచ్చుకున్నారు. జన్మభూమి రుణం తీరుచుకునేందుక తాను ఈ సాయం చేశానని, నా శక్తి మేరకు ఎంతైనా నాకు జన్మనిచ్చిన ఊరికి సేవల చేస్తానని ఎల్సీ గోపయ్య భరోసా ఇచ్చారు.

ప్రైవేటు ఉపాధ్యాయులకు ఆపన్నహస్తం
కరోనా కటువు పరిస్థితుల్లో ఎల్సీ గోపయ్య తన సొంత ఖర్చుతో వందలాది మంది ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు సాయం చేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో 100 మందికి, దేవరకొండ పట్టణంలో 50 మంది ప్రైవేటు ఉపాధ్యాయులకు నిత్యావసర సరుకుల కిట్లను అందజేసి ప్రైవేటు ఉపాధ్యాయుల కుటుంబాలకు ఆపన్నహస్తం అందించారు. యాజమాన్యాలు కానీ, విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ఎవరూ పట్టించుకోని తమను గోపయ్య సారు సాయం చేయడం మరిచిపోలేమని.. అన్న ప్రైవేటు టీచర్ల తృప్తిని తాను జీవితాంతం మరువలేనని గోపయ్య చెప్తారు.

హైదరాబాద్‌లో విస్తరించిన సేవ
ఎల్సీ గోపయ్య హైదరాబాద్‌ మహానగరంలోని వివిధ ప్రాంతాల్లో నివాసముండే పేదలెందరికో సాయం చేశారు. హైదరాబాద్ లోని వివిధ స్లమ్ ఏరియాల్లో దాదాపు 500 కుటుంబాలతో పాటు మరెన్నో ప్రాంతాల్లోని పలువురికి కరోనా సమయంలో నిత్యావసర సరుకులు అందజేశారు. జనగామ జిల్లా పిట్టలగూడెంలోని పిట్టలను పట్టుకొని బతికే వారికి దుస్తులను అందజేశారు. హైదరాబాద్ చాదర్ ఘాట్ ప్రాంతంలో గుడిసెలు కాలిన సందర్బంగా బాధిత కుటుంబాలకు వంట పాత్రలు, దుస్తులు అందజేసి వితరణ చాటుకున్నారు.

గోపయ్య సారు సంగీత, సాహిత్యాభిమాని
ఎల్సీ గోపయ్య ఒక అధికారిగానే కాక, సేవాగుణమున్న సంఘ సేవకుడిగానే కాక, సాహిత్య, సంగీత, సాంస్కృతిక శ్రేయోభిలాషిగా ఆయన సేవలు విస్తరించాయి. మారుమూల ప్రాంతాల్లో పొలాల్లో పాటలు పాడుకొనే 106 మందిని గుర్తించిన గోపయ్య వారికి ప్రోత్సాహక బహుమతులు ఇచ్చి మెచ్చుకున్నారు. కర్నూలు, వరంగల్ జిల్లాలోని 52 మంది పేద కూచిపూడి, భరత నాట్య కలకారులను గుర్తించి నగదు ప్రోత్సాహకాలు ఇచ్చి ప్రశంసించారు. పల్లెల్లో ఆటల పోటీలకు పలుమార్లు ఆర్థికంగా సాయం చేస్తూ క్రీడాకారులకు ప్రోత్సాహం అందించారు. పేదపిల్లలు చదువుకునే సందర్బంలొ నోట్ పుస్తకాలు, బట్టలకు ఆర్థికంగా సహాయం చేశారు.

సేవల్లో గోపయ్య పోటీ..
ఎల్సీ గోపయ్య సారు.. పేదలంటే తనకు తోచిన సాయం చేయాలనే తపన ఉన్న వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. తన కుటుంబాన్ని పోషించుకుంటూ, తనకు వచ్చిన వేతనంలోనే నెలనెలా కొందరికైనా సాయం చేయందే ఆయనకు నిద్రపట్టదు. పలుచోట్ల పేదవారు చనిపోయిన సందర్బంలో ఎన్నో పేద కుటుంబాలకు ఆర్థికసాయం అందజేశారు. పేద యువతుల వివాహాలకు కూడా గోపయ్య ఆర్థికసాయం అందజేశారు. బాల కార్మికులు కనిపిస్తే పోలీసు వారికి తెలియజేస్తూ వారిలో విద్యవైపు మళ్లిస్తుంటారు. చిన్న పిల్లలకు, మహిళలకు అవాంఛనీయ సంఘటనలు జరిగినపుడు అండగా ఉంటారు. పర్యావరణ పరిరక్షణలో బాగంగా విరివిగా మొక్కలు నాటే కార్యక్రమాల్లో భాగస్వామిగా మారారు.

నింగినేల మేము సైతం ద్వారా సేవలు
నింగినేల- మేము సైతం ఫౌండేషన్‌ ఫౌండర్‌ ప్రెసిడెంట్‌గా ఎల్సీ గోపయ్య ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ఎందరిలోనే స్ఫూర్తిని రగిలించి ఎందరో అసహాయులకు ఆపన్నహస్తం అందించేలా రగిలించారు. ఎందరో సామాజిక సేవకులుగా మారేందుకు గోపయ్య దోహదపడ్డారు. మనకు దొరికే కొద్దిపాటిలో తోటి వారికి ఎంతో కొంత సాయం చేద్దాం.. అని ఎందరిలోనో చైతన్యం తెచ్చిన గోపయ్యను పలువురు ఆదర్శంగా తీసుకుంటారు.

మానాన్నే నాకు స్ఫూర్తి : ఎల్సీ గోపయ్య, నింగినేల- మేము సైతం ఫౌండేషన్‌ ఫౌండర్‌ ప్రెసిడెంట్‌


లకుమళ్ల చిన్న గోపయ్య, ఉష దంపతులు

ఎన్ని అవాంతరాలు ఎదరైనా.. నాకొచ్చే కొద్దిపాటిలో కుటుంబానికి పోను ప్రతీనెలా పేదలకు సాయం చేస్తూనే ఉంటా. నేను చిన్నతనంలో ఎన్నో కష్టాలు పడ్డా. పట్టుదలతో చదివి విద్యుత్‌ శాఖలో ఉన్నతోద్యోగిని అయ్యా. తోటివారికి సాయం చేయి.. అన్న మా నాన్న నేర్పిన పాఠం నాకు ఎప్పుడూ గుర్తుంటుంది. సాయం చేయడంలోనే నాకు తృప్తి ఉంటుంది. నా సతీమణి లకుమళ్ల ఉష తోడ్పాటుతోనే నేను సేవా కార్యక్రమాలు చేపడుతున్నా. వ్యక్తిగతంగా, ఫౌండేషన్‌ పరంగా ఎంతో మందికి సేవ చేశాం. ఇంకా చేస్తూనే ఉంటాం.