• ఏం మారిండో చూద్దురు రండి
రచ్చబండ ప్రతినిధి, హైదరాబాద్ :ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చిన నేత.. ప్రత్యేక రాష్ట్ర బలోపేతానికి బాటలు వేసిన స్ఫూర్తి ప్రదాత.. మన కేసీఆర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రత్యేక రాష్ట్రంలో తనదైన ముద్ర వేసుకున్న ఆయన వ్యక్తిత్వం తెరిచిన పుస్తకమే.
నాడు ఆంధ్రా పాలకుల గుండెల్లో సింహస్వప్నమైన ఆయన నేడు ప్రతిపక్ష నేతలకు కొరకరాని కొయ్యగానూ మారారు. కేసీఆర్ ఎవరి మాటా వినని సీతయ్య.. అని కూడా పరోక్షంగా అంటుంటారు. కానీ ఇప్పుడు ఆయన కొందరి మాట వింటున్నాడని అనుకోవచ్చు. అందుకు తాజా ఉదంతాలే మనకు గోచరిస్తున్నాయి.
ఆయన పాలన ఎలా ఉంది.. మంచీ, చెడుల గురించి ప్రస్తావించదల్చుకోలేదు. కానీ ఆయనలో వచ్చిన ఓ మార్పు చర్చనీయాంశంగా మారింది.
ఉద్యమ సమయంలో, ప్రత్యేక రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ అధినేతగా ఉన్న కేసీఆర్ ఎంతో మంది నేతలను తయారు చేశారు. అయితే ఆయనకు ఓ మచ్చ ఉంది. తెలంగాణ ఉద్యమకారులు రానురాను ఆ పార్టీ వీడి పోతున్నారని, ఉద్యమ ద్రోహులను చేరదీస్తున్నారని ఆరోపణ.
ప్రభుత్వంలోనూ తెలంగాణ వ్యతిరేకులకు పదవులు కట్టబెట్టారని ఆయనపై ప్రధాన విమర్శ ఉంది. నాటి నరేంద్ర, విజయశాంతి నుంచి తాజాగా బూర నర్సయ్య గౌడ్ వరకూ ఎందరో ఆయనకు సన్నిహితంగా మెలిగిన, ఆయన మెచ్చుకున్న నేతలు ఆయనకు దూరమై విమర్శలు గుప్పించేదాకా పరిస్థితి వెళ్లింది. అయితే కేసీఆర్ ఎవరినీ లెక్కపెట్టలేదు. ఐడోంట్‌కేర్ అన్నట్లుగా వ్యవహరించారు. టేకిటీజీగా తీసుకున్నారు.
అయినా రానురాను అటు టీఆర్‌ఎస్ పార్టీ సహా కేసీఆర్ బలోపేతమవుతూ వచ్చారు. ఏనాడూ లోటు కనిపించలేదు. ఆయనకూ అనిపించలేదు. వెళ్లిన నేతలను ఏనాడూ బుజ్జగించిన దాఖలాలు లేవు. ఒకరిద్దరు మినహా ఎవరినీ మళ్లీ రమ్మని పిలిచిన సందర్భాలూ లేవు. ఎవరినీ పురమాయించనూ లేదు. కేసీఆర్ ను ఏదైనా అడిగేందుకు ఎవరూ ధైర్యం చేసేవారు కాదు. ఆయనకు నచ్చకుంటే మంత్రులైనా, నేతలైనా ఇట్టే దుమ్ము దులిపేస్తారు. నోచ్చుకున్నా, గిచ్చుకున్నా ఆయన మాత్రం చలించేవారు కాదు.
కానీ మునుగోడు ఎన్నికల పుణ్యమా.. అనో.. లేక తరుముకొస్తున్న సాధారణ ఎన్నికలనా ఏమో కానీ కేసీఆర్ లో భారీ మార్పు చోటుచేసుకుందని విశ్లేషకులు సైతం ఒప్పుకుంటున్నారు. ఎలాగైనా మునుగోడులో గెలిచి నిలవాలని పట్టుదల పెంచుకున్నట్లున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను రంగంలోకి దించి గెలిచి తీరాలని టార్గెట్లు పెట్టినట్లు చెప్పుకుంటున్నారు. ఆచీతూచి అభ్యర్థిని ప్రకటించిన కొన్నాళ్లకే మాజీ ఎంపీ, బీసీ నేత డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ఉన్నట్టుండి టీఆర్‌ఎస్ కు గుడ్ బై చెప్పారు. కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.
ఆ నియోజకవర్గంలోని పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు కూడా బీజేపీలోకి వసల గట్టారు. ఎలాగైనా కట్టడి చేయాలని ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ కు కేసీఆర్ సీరియస్ గా చెప్పారని వినికిడి. ఆ మేరకే మొదటి వికెట్ గా కాంగ్రెస్ ముఖ్య నేత, జర్నలిస్టు నాయకుడు పల్లె రవికుమార్ గౌడ్ ను బుట్టలో వేసుకున్నారు.
దానిని అంతటితోనే ఆపకుండా కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. టీఆర్‌ఎస్ లో వరుస చేరికలకు డోర్లు తెరిచారు. తనపైన అలిగి, పదవులు రాక టీఆర్‌ఎస్ పార్టీ మారిన నేతలపైనే కేసీఆర్ కన్నేశారు. అలిగిన ఆ నేతలకు కబురు పెట్టించారు. ఏనాడూ బుజ్జగించని నేతలను అనునయించే ప్రయత్నాలు షురూ చేశారు.
ఇంకేముంది.. కేసీఆర్ బ్యాటింగ్ మామూలుగా లేదు. నల్లగొండ ఉమ్మడి జిల్లాలోని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ ను ఉన్న ఫలంగా టీఆర్‌ఎస్ లో చేర్చుకున్నారు. ఆయన ఇటీవలే భారీ స్థాయిలో బీజేపీలో చేరడం గమనార్హం.
అంతటితో కేసీఆర్ బ్యాటింగ్ ఆగలేదు. ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన దాసోజు శ్రవణ్ పై దృష్టి పెట్టారు. ఆయన దృష్టికి వికెట్ పడనే పడింది. ఆయన ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తాజాగా కేసీఆర్ చొరవతో వెంటనే టీఆర్‌ఎస్ పార్టీలో చేరిపోయారు.
అమ్మా అంతటితో వదిలాడనుకున్నారా.. అస్సలు తగ్గట్లే.. అదే స్పీడ్ తో నాటి ఉద్యమ సహచరుడు స్వామిగౌడ్ ను తోలుకురమ్మని కబురంపాడు. పెద్దాయన అట్ల జెప్పిండో లేదో ఆయనా బీజేపీకి రాంరాం చెప్పి గులాబీ గూటిన కేసీఆర్ పంచన చేరిపోయారు. ఇగ కేసీఆర్ బీజేపీతో తగ్గేదెలే.. అన్నట్లు బ్యాటింగులో దూసుకుపోతున్నారు. ఇంకెంతమందిని రాగుంజుతారో వేచి చూద్దాం.. అందుకే ఎవరికీ తలొగ్గని కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నిక పుణ్యమా అని కొందరు నేతల తల నిమిరేందుకు వెనుకాడలేదు.
అందుకే.. కేసీఆర్ సార్ మీరు మారారు..