రచ్చబండ, ఆన్ లైన్ ప్రతినిధి : తామిష్టపడిన యువతి తనను ప్రేమించలేదని, ప్రేమను ఒప్పుకోలేదని, పట్టించుకోవడం లేదని, వేరొకరిని పెళ్లాడుతుందని ఎందరో ఉన్మాదులు దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.
అలాంటి కోవలోనే ఓ దుండగుడు తన ప్రేమను నిరాకరించిందనే కారణంతో తాజాగా ఓ యువతిని నరికిచంపాడు. ఎన్ని శిక్షలు అమలు చేస్తున్నా ఇలాంటి ఉన్మాద చర్యలు ఆగడం లేదు.
కర్ణాటక రాష్ట్రంలోని విజయనగర జిల్లా కన్నిబొరయ్య హట్టి గ్రామంలో నిర్మల అనే యువతిని భోజరాజు అనే యువకుడు నిత్యం వేధించేవాడు. ప్రేమ పేరుతో ఆమెను టార్చర్ చేసేవాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. దీంతో ఈ విషయం తెలిసిన ఆ యువతి కుటుంబ సభ్యులు అతడితో పెళ్లికి నిరాకరించారు.
ఈ దశలో రెండు నెలల క్రితం భోజరాజు వేరే యువతిని వివాహమాడాడు. అయినప్పటికీ నిర్మలను మరువలేక పోయాడు. నిర్మల తనకు దక్కలేదనే బాధ, తన ప్రేమను నిరాకరించిందనే కసిని పెంచుకున్న అతడు ఉన్మాదిగా మారాడు.
నిర్మల తప్ప ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి వారింటికి వెళ్లిన భోజరాజు ఘోరానికి ఒడిగట్టాడు. నిర్మలతో ఘర్షణ పడి ఆమె తల నరికాడు. ఆ తలను తీసుకొని అక్కడి పోలీస్ స్టేషన్ లో దుండగుడు లొంగిపోయాడు.