పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, స్థలాలు ఇవ్వాలి

పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, స్థలాలు ఇవ్వాలి
* సీపీఎం చేవెళ్ల డివిజన్ కన్వీనర్ అల్లి దేవేందర్
* తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా

రచ్చబండ, శంకర్ పల్లి; అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూములు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని శంకర్ పల్లి కార్యాలయం ఎదుట శుక్రవారం సిపిఎం పార్టీ చేవెళ్ల డివిజన్ కన్వీనర్ అల్లి దేవేందర్, శంకర్ పల్లి మండలం కార్యదర్శి ఏనుగు మల్లారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సిపిఎం కార్యాలయం నుండి తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కార్యకర్తలతో ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శంకర్ పల్లి పట్టణ కేంద్రంలో చాలామంది పేదలు అనేక సంవత్సరాలుగా కిరాయి ఇండ్లలో నివాసముంటున్నారని తెలిపారు, వారికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటు హక్కు కార్డులు ఉన్నప్పటికీ పాలకులు వారికి ఇప్పటికి డబుల్ బెడ్ రూమ్ లు, లేదా ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు పూరి గుడిసెలలో కాపురం ఉంటున్నారని ఈగలు, దోమల మధ్య బతుకుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ లు, ఇవ్వాలని డిమాండ్ చేశారు.

చేవెళ్ల నియోజకవర్గం లో అనేక బంజారా, సికం మిగులు అధికార పార్టీ నాయకులు, బడా కార్పొరేట్లు కుమ్ముకై కబ్జాలు చేస్తున్నారని తెలిపారు. జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఇలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, అదే పేదవాడు గుడిసెలు వేసుకుంటే వెంటనే స్పందించి వారిపై కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని దుయ్యబట్టారు. సిపిఎం పార్టీ అరెస్టులకు భయపడకుండా పేదల పక్షాన పోరాటం చేస్తుందని పేదల కోసం జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ శంకర్ పల్లి మండల నాయకులు నరసింహ, సురేష్, కుమ్మరి సత్యం, మహిళా నాయకురాలు పద్మ, రాధా, అయేషా బేగం, ఇందిరమ్మ, సుజాత తదితరులు పాల్గొన్నారు.