Sanathana Dharam Foundation.. హిందువులను ఏకం చేయడమే లక్ష్యం

  • మహారాష్ట్ర రాయగడ్ లో సనాతన ధర్మస్థలి
  • పదివేల ఎకరాల్లో నిర్మాణం
  • సనాతన ధర్మ ఫౌండేషన్ ఫౌండర్ సుదేశ్ అగర్వాల్

రచ్చబండ, శంకర్ పల్లి: మన హిందూ సంస్కృతి సంప్రదాయాలను కాపాడాలని ఉద్దేశంతో, హిందువులంతా ఒకే చోట చేరే విధంగా మహారాష్ట్ర లోని రాయగడలో పదివేల ఎకరాలలో 20 వేల కోట్ల రూపాయలతో సనాతన ధర్మస్థలి నిర్మాణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సనాతన ధర్మ ఫౌండేషన్ ఫౌండర్ సు దేశ్ అగర్వాల్ తెలిపారు.

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం గోపులారం గ్రామంలో శుక్రవారం బీజేపీ చేవెళ్ల నియోజకవర్గ నాయకులు తొండ రవి స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 10,000 ఎకరాల్లో వేద పాఠశాలలు, దేశంలో గల అన్ని దేవాలయాలు నిర్మాణాలు, చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు 5 కోట్ల మంది ఈ సనాతన ధర్మస్థలిలో కలుసుకునే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

పార్టీలకు అతీతంగా ఈ నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. ఒకేసారి 10000 మంది వేదాలు నేర్చుకోవడానికి ఆడిటోరియాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఐదు ఎకరాలలో గోశాలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. మూడు నాలుగు నెలల్లో దేశ ప్రధాని నరేంద్ర మోడీతో ఈ నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

జైన్, సిక్కు, బౌద్ధ మందిరాలను కూడా ఇక్కడ నిర్మించడం జరుగుతుందని చెప్పారు. ముస్లింలు, క్రైస్తవులు మక్కా, వాటికన్ సిటీ కి ఎలా వెళ్తారో ఆ విధంగా ప్రతి సంవత్సరం ఈ సనాతన ధర్మస్థలికి వచ్చే విధంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. హిందువులు మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడాలని, ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన అలవాటు చేసుకోవాలని ఆయన కోరారు.