పారిశుధ్య కార్మికులకు డబుల్ ఇండ్లు కేటాయించాలి

  • సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్

రచ్చబండ, శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మున్సిపల్ పారిశుధ్య అర్హులైన కార్మికులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ కోరారు. ఆదివారం నవాబుపేట మండలం చించల్ పేట గ్రామంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య నివాసంలో ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ శంకర్ పల్లి పట్టణ కేంద్రంలో ప్రజలు ఆరోగ్యంగా ఉండడం కోసం పారిశుధ్య కార్మికులు నిరంతరం పనులు చేస్తున్నారని చెప్పారు. చాలీచాలని వేతనాలతో వారి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. ఇల్లు లేని పారిశుధ్య కార్మికులకు డబుల్ బెడ్ ఇండ్లు కేటాయించాలని  కోరారు. సొంత ఇండ్ల స్థలాలు ఉన్నవారికి ప్రభుత్వం అందించే మూడు లక్షల రూపాయలను అందించనున్నట్టు ఎమ్మెల్యే హామీ ఇచ్చారని దేవేందర్ తెలిపారు.

కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు బి.రమేష్, కోశాధికారి రాములు, ఉపాధ్యక్షులు కృష్ణ శాంతి కుమార్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.