• ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ బోణీ?
• టీఆర్ఎస్ పార్టీ నుంచి కీలక నేత కుటుంబం చేరిక
అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఇప్పటి వరకూ ఉత్తర తెలంగాణలో ఆధిపత్యంలో కొనసాగుతున్న ఆ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ముంచుకొచ్చిది. ఈ మేరకు ఆ పార్టీ కీలక నేత కుటుంబం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నది. దీంతో చేరికల పర్వానికి తెరలేసినట్లయింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ కీలక నేతగా, మాజీ ఎమ్మెల్యేగా గుర్తింపు ఉన్న నల్లాల ఓదేలు కుటుంబం గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరింది. వారు బుధవారమే ఢిల్లీకి చేరుకున్నారు. గురువారం ప్రియాంక గాంధీ ఓదేలు కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
నల్లాల ఓదేలు మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014లో చెన్నూరు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగారు. అయితే అనంతరం 2018 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ ఓదేలుకు కాకుండా బాల్క సుమన్ కు టికెట్ కేటాయించింది.
అనంతరం జరిగిన జడ్పీ ఎన్నికల్లో ఓదేలు సతీమణి నల్లాల భాగ్యలక్ష్మికి మంచిర్యాల జడ్పీ చైర్ పర్సన్ గా టీఆర్ఎస్ పార్టీ అవకాశం కల్పించింది. అయితే తన భార్యకు సరైన ప్రొటోకాల్ పాటించలేదని, ప్రాధాన్యం దక్కలేదని చేరిక సందర్భంగా ఓదేలు తన మనోగతం తేల్చి చెప్పారు.
తన భార్య, జడ్పీ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మి సహా తన ఇద్దరు కుమారులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి రాజనర్సింహ కూడా ఉన్నారు.
ఓదేలు కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీలో తగిన ప్రాతినిథ్యం ఉంటుందని చేరిక సందర్భంగా ప్రియాంక గాంధీ హామీ ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి, ఓదేలు ప్రకటించారు. ఈ విషయంపై రేవంత్ రెడ్డి కూడా విలేకరుల సమావేశంలో ప్రకటించారు.