అభివృద్ధి పనులకు అధికారులు సహకరించాలి

శంకర్ పల్లి ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి

రచ్చబండ, శంకర్ పల్లి: గ్రామాలలో జరిగే అభివృద్ధి పనులకు అధికారులు సహకరించాలని రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి ఎంపీపీ డి.గోవర్ధన్ రెడ్డి కోరారు. మంగళవారం స్థానిక మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గ్రామాలలో నివసిస్తున్న పేదలకు సహకరించేలా అధికారులు పనులు చేపట్టాలని తెలిపారు. ఇంటి స్థలాలు కలిగి ఉన్న వారికి వెంటనే ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని కోరారు.

మండలంలో పలు ప్రాంతాలలో భారీ నిర్మాణాలు చేపడుతున్నారని వాటికి అనుమతులు ఉన్నాయని ప్రశ్నించారు. మండలంలోని కొన్ని రిసార్ట్స్ లు, ఫామ్ అవుజులలో కట్టిన నిర్మాణాలకు పన్నులు అధికంగా వసూలు అయ్యేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామంలో ఇంటి నిర్మాణాలకు ఎందుకు అనుమతులు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. ఫామ్ హౌస్ ల వారికి నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారని, తమ ఇండ్లకు ఎందుకు అనుమతులు ఇవ్వడం లేదని నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇంటి స్థలాలు కలిగి ఉన్న వారికి వెంటనే వారు ఇల్లు నిర్మించుకోవడానికి అనుమతులు ఇవ్వాలని కోరారు.

మండలంలోని కొన్ని పాఠశాలలను మధ్యాహ్న భోజనం విద్యార్థులతో వడ్డిస్తున్నారని తెలిపారు. ఇలా విద్యార్థులతో భోజనాలు వడ్డించకూడదని ఆదేశించారు. కాగా జనవాడ పాఠశాలలో కొందరు ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చి రిజిస్టర్లో సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారని తెలిపారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఎం ఈ ఓ సయ్యద్ అక్బర్ ను ఆదేశించారు. కొండకల్ గ్రామ శివారులో విద్యుత్ తీగలు వేలాడుతున్నాయని వాటిని సరిచేయాలని ఆ గ్రామ ఎంపీటీసీ బద్దం సురేందర్ రెడ్డి ట్రాన్స్కో అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

మిర్జాగూడ అనుబంధ గ్రామమైన ఇంద్రారెడ్డి నగర్ లో విద్యుత్ సమస్యలు అనేకం ఉన్నాయని ఆ గ్రామ సర్పంచ్ గౌండ్ల రవీందర్ గౌడ్ తెలిపారు. అలాగే మియా ఖాన్ గడ్డ నుండి వేణుగోపాలస్వామి దేవాలయం వరకు నిర్మించే సీసీ రోడ్డుకు అనుమతులు ఇవ్వాలని ఇరిగేషన్ శాఖ అధికారులను కోరారు.

దొంతంపల్లి, మహారాజ్ పేట్, గోపులారం గ్రామాలలో విద్యుత్ సమస్యలు అనేకం ఉన్నాయని ఆయా గ్రామాల సర్పంచులు అశ్విని సుధాకర్, దోసాడ నరసింహారెడ్డి, పొడవు శ్రీనివాస్ సభ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే తమ గ్రామాలలో ఉన్న విద్యుత్ సమస్యలను సరిచేయాలని వారు కోరారు.

ఇంద్రారెడ్డి నగర్ గ్రామంలో ఉపాధ్యాయుల కొరత ఉందని సర్పంచ్ రవీందర్ గౌడ్ తెలిపారు. పర్వేద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని ఆ గ్రామ ఎంపిటిసి వెంకటరెడ్డి కోరారు. మిషన్ భగీరథ నీరు సక్రమంగా సరఫరా కావడం లేదని సభ్యులు సభలో తెలిపారు.

ఈ కార్యక్రమంలో జడ్పిటిసి చేకూర్త గోవిందమ్మ గోపాల్ రెడ్డి, శంకర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మారేపల్లి పాపారావు, అడిషనల్ పిడి జంగారెడ్డి, ఎంపీడీవో వెంకయ్య, ఎంపీ ఓ గీత, మండల ఏవో సురేష్ బాబు, డిప్యూటీ తాసిల్దార్ ప్రియాంక, ఏపీవో నాగభూషణం, ఏపీఎం భీమయ్య, ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ రేవతి రెడ్డి, వెటర్నరీ డాక్టర్ జయసుధ, ట్రాన్స్కో ఏ ఈ ప్రదీప్, ఇరిగేషన్ ఏ ఈ రాధిక, సూపరిండెంట్ రవీందర్, పలు శాఖల అధికారులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.