అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్ పై తొలి సంతకం
దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచిత వైద్యం అమలు
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
భువనగిరి : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రైతుల క్షేమం కోసం ఎన్నో అభివృద్ధి పథకాలు చేపట్టిన గొప్ప నేత అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొనియాడారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా గురువారం భువనగిరి పట్టణంలోని వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో కరెంట్ బిల్లు కట్టకపోతే రైతులను జైల్లో వేస్తే.. రైతుల బాధలను తెలుసుకొని అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం ఉచిత కరెంట్ మీద పెట్టిన గొప్ప నేత వైఎస్ అని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఉచిత వైద్యం అందించి ఎన్నో ప్రాణాలను కాపాడినట్లు వివరించారు.
ప్రతి పేదవాడిని కలిసి వారి బాధలు తెలుసుకోవాలని వైఎస్సార్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారని అన్నారు. పాదయాత్రలో తెలుసుకున్న సమస్యలను అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరించినట్లు గుర్తు చేశారు.
రూ.34 వేల కోట్లతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ చేపట్టి చేవెళ్ల వరకు సాగునీరు ఇవ్వాలని వైఎస్ఆర్ చూస్తే లక్ష కోట్లు ఖర్చు పెట్టి కొండ పోచమ్మ వరకే కేసీఆర్ నీటిని తీసుకువచ్చినట్లు తెలిపారు.
జనంతో మమేకం కావాలి
పీసీసీ కార్యవర్గంలో ఉన్న నేతలు తమ నియోజక వర్గాల్లో ప్రజలతో మమేకమై అందరికీ అందుబాటులో ఉండాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు. అందరం కలిసి కట్టుగా ఉండి లక్ష కోట్లు దోపిడీ చేసిన కేసీఆర్ ను ఓడించాలని పిలుపునిచ్చారు.
ఎయిమ్స్ అభివృద్ధికి కృషి చేస్తా
ఎయిమ్స్ కు తక్కువ నిధులు కేటాయించడం పై కేంద్రాన్ని రానున్న పార్లమెంట్ సమావేశాల్లో నిలదీస్తానని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. నేడు బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్ భాటియాతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో పెండింగ్ లో ఉన్న పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. కేంద్రం ఎయిమ్స్ పట్ల చిన్న చూపు చూస్తుందని ఎంపీ ఆరోపించారు.
ఇతర రాష్ట్రాల ఎయిమ్స్ ఆస్పత్రులకు వందల కోట్లు ఇస్తూ.. బీబీనగర్ ఎయిమ్స్ కు కేవలం రూ.28 కోట్లు మాత్రమే నిధులు విడుదల చేసి వివక్ష చూపిస్తున్నారని అన్నారు. ఎయిమ్స్ కు తక్కువ నిధులు కేటాయించడం పై కేంద్రాన్ని రానున్న పార్లమెంట్ సమావేశాల్లో నిలదీస్తానని స్పష్టం చేశారు. అలాగే ఎయిమ్స్ ప్రాంగణంలో నుంచి వెళుతున్న హైటెన్షన్ విద్యుత్ తీగలను తొలగించాలని ట్రాన్స్ కో సీఎండీ రఘుమారెడ్డి తో ఫోన్ లో కోరారు. వెంటనే ఆ సమస్యను పరష్కారిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం డైరెక్టర్ భాటియా తో కలిసి ఆస్పత్రి ప్రాంగణంలో చెట్టు నాటారు. ఎయిమ్స్ బీబీ నగర్ ను ఎయిమ్స్ హైదరాబాద్ గా మార్చాలని ఎంపీకి డైరెక్టర్ విన్నవించారు.