అధికారుల గైర్హాజరుపై చర్యలకు కలెక్టర్ కు నివేదిస్తాం

అధికారుల గైర్హాజరుపై చర్యలకు కలెక్టర్ కు నివేదిస్తాం
* రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి

రచ్చబండ, శంకర్ పల్లి: మూడు నెలలకు ఒకసారి జరిగే మండల సర్వసభ్య సమావేశాలకు వివిధ శాఖల సంబంధిత అధికారులు హాజరు కాకపోవడం విడ్డూరమని రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గ్రామాలలో కొన్ని సమస్యలు నెలకొని ఉన్నాయని వాటిని పరిష్కరించడానికి సంబంధిత శాఖ అధికారులు సమావేశానికి రాకపోవడం శోచనీయమన్నారు.

మండలంలోని కొన్ని గ్రామాలలో విద్యుత్ సమస్యలు నెలకొల్నాయని, ఈ సమస్యలు సర్పంచులు ఎవరితో మొరపెట్టుకోవాలి అని ప్రశ్నించారు. మండల సర్వసభ్య సమావేశానికి మండల విద్యుత్ అధికారి హాజరు కాకపోవడంతో ఎంపీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి సమావేశంలో పాల్గొనని అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు నివేదిస్తామని తెలిపారు. అధికారులు మండల సర్వసభ్య సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. కాగా మండలంలోని కొన్ని గ్రామాలలో మిషన్ భగీరథ తాగునీరు సరఫరా కావడం లేదని వెంటనే మిషన్ భగీరథ నీరు సరఫరా అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. మండలంలోని మిర్జాగూడ గ్రామ సమీపంలో ఉన్న తుమ్మ చెరువు లో కొందరు మట్టి పోసి చెరువును కబ్జా చేస్తున్నారని రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు, సర్పంచ్ గౌండ్ల రవీందర్ గౌడ్, జనవాడ ఎంపీటీసీ నాగేందర్ ఇరిగేషన్ అధికారులు దృష్టికి తీసుకువచ్చారు.

వెంటనే చెరువులో మట్టి పోయడం నిలిపివేయాలని వారు అధికారులను కోరారు. చెరువులో మట్టి పోయడంతో తుమ్మ చెరువు కనుమరుగు అయిపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఫిరంగి కాలువ కాపాడడంలో ఇరిగేషన్ శాఖ అధికారులు విఫలమవుతున్నారని పద్మావతి రవీందర్ గౌడ్ గార్డెన్స్ యజమాని మిర్జాగూడ సర్పంచ్ రవీందర్ గౌడ్ తెలిపారు. తమ గార్డెన్స్ ఎదుట గుంతలు తీసి పార్కింగ్ లేకుండా చేశారని చెప్పారు. ఇతరులు ఫిరంగినాలను కబ్జా చేసే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సర్పంచ్ ఇరిగేషన్ అధికారులను నిలదీశారు. మహారాజ్ పేట్ గ్రామంలో అంగన్వాడి వద్ద మరుగుదొడ్డి నిర్మించి సంవత్సరమైన వాటికి సంబంధించిన బిల్లులు ఇంతవరకు రాలేదని ఆ గ్రామ సర్పంచ్ దోసాడా నరసింహారెడ్డి తెలిపారు.

పర్వేద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని ఆ గ్రామ ఎంపిటిసి వెంకటరెడ్డి కోరారు. మహాలింగాపురం గ్రామంలో కూడా పాఠశాలకు ప్రహరీ గోడ లేదని వెంటనే నిర్మించాలని ఆ గ్రామ ఎంపీటీసీ యాదగిరి తెలిపారు. రేషన్ కార్డులు ఉండి బియ్యం రానివారు తమ వద్దకు వస్తే బియ్యం ఇప్పించేలా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ తహసిల్దార్ ప్రియాంక తెలిపారు. వచ్చేనెల 8వ తేదీన మోకిలా గ్రామంలోని రైతు వేదిక వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తామని మండల వ్యవసాయ అధికారి సురేష్ బాబు తెలిపారు.

వేసవిలో కూరగాయల సాగు కోసం ఉద్యాన శాఖ ద్వారా టమాట, మిర్చి, కాస్పికం వంటి కూరగాయల నారును ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి జూన్ వరకు రాయితీలో రైతులకు ఇవ్వడం జరుగుతుందని ఉద్యానవన శాఖ అధికారి అశోక్ తెలిపారు. కాగా మండల సర్వసభ్య సమావేశంలో వైద్యశాఖ వారు సిపిఆర్ పై సర్పంచులు, ఎంపీటీసీలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి చేకూర్త గోవిందమ్మ గోపాల్ రెడ్డి, పంచాయతీరాజ్ డిప్యూటీ ఈ ఈ జగన్ రెడ్డి, ఎంపీడీవో వెంకయ్య, ఎంఈఓ సయ్యద్ అక్బర్, ఈ ఓ ఆర్ డి గీత, డాక్టర్ రేవతి రెడ్డి, వెటర్నరీ డాక్టర్ బెంజిమన్, ఏపీవో నాగభూషణం, ఏ పి ఎం భీమయ్య, సూపరింటెంట్ రవీందర్, పలు గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, అధికారులు పాల్గొన్నారు.