ఇంజినీరింగ్ కాలేజీ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

  • నిర్మాణ స్థలం లేఅవుట్ కు ఆమోదం
  • తాత్కాలికంగా పీజీ కళాశాలలో తరగతులు
  • పాలిటెక్నిక్ కళాశాలలో పరిపాలనా భవనం
  • వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడి

నిఘా, వనపర్తిటౌన్ : వనపర్తి జిల్లా కేంద్రంలో ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణానికి సంబంధించిన లే అవుట్ కు ఆమోదం లభించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలో జేఎన్టీయూ అధికారులతో మంత్రి నిరంజన్ రెడ్డి వీసీ కట్టా నర్సింహారెడ్డి, రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్, జోనల్ కమిషనర్ శంకరయ్యతో సమావేశమయ్యారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ వనపర్తి పీజీ కాలేజీలో ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అందుకు సంబంధించిన ఏఐసీటీఈ మార్గదర్శకాలకు అనుగుణంగా మౌలిక వసతులు, సౌకర్యాల కల్పన, కళాశాల భవనం నిర్మాణమయ్యే వరకు పీజీ కళాశాలలో తరగతుల నిర్వహణ, కళాశాల పరిపాలనా భవనంగా వనపర్తి పాలిటెక్నిక్ కళాశాలను వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు.

300 సీట్లతో ఇంజినీరింగ్, 60 సీట్లతో బీ-ఫార్మసీ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. వనపర్తి ఇంజనీరింగ్ కళాశాలలో సీఎస్ఈ, సీఎస్ఈ (ఏఐ, ఎంఎల్), ఈసీఈ, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ కోర్సులు ఉన్నాయని వివరించారు.