ఐదో విడత పల్లెప్రగతి సరే.. అంతకు ముందు విడతల పనులు చేసిన బిల్లులు ఎందుకు విడుదల కాలేదు. పనులు చేసిన సర్పంచులు అప్పుల్లో మునిగి పోయారు. ఒక్కో పంచాయతీకి లక్షల్లో బిల్లులు రావాలి. నిధుల విడుదలలో ఎందుకు జాప్యం చేస్తున్నారు.
ఇప్పటికైనా అనుమతించాలి. వచ్చే పల్లెప్రగతికి ప్రత్యేక నిధులు కేటాయించాలి.. అని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం కేసీఆర్, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, టి.హరీశ్ రావుతోపాటు సూర్యాపేట జిల్లా కలెక్టర్ పేరిట బహిరంగ లేఖను ఆదివారం విడుదల చేశారు. ఆలేఖ వివరాలు ఇలా ఉన్నాయి.
మండల ప్రత్యేక అధికారి, ఎంపీడీవో, ఎంపీవో ఆదేశాల మేరకే సర్పంచులు పనులు చేశారు. ఒక్కో పంచాయతీలో సుమారు రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పనులు చేశారు. ఏళ్లు గడుస్తున్నా బిల్లులు అందడం లేదని తెలిపారు.
చిన్న పంచాయతీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నిర్వహణ తలకు మించిన భారంగా మారింది. పల్లె ప్రగతి పనుల బిల్లులందక సర్పంచులు ఆర్థికంగా చితికిపోవడంతో పాటు మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల సిబ్బందికి జీతాలివ్వలేక అవస్థలు పడుతున్నారు.
ఎస్టీవో కార్యాలయంలో ఫ్రీజింగ్ కారణంగా పూర్తి చేసిన పనులకు మూడు నుంచి ఆరు నెలల వరకు బిల్లులు పెండింగ్ లో ఉంటున్నాయి. ఇప్పటికైనా స్పందించి ఐదో విడత పల్లెప్రగతి ప్రారంభించక ముందే గత కార్యక్రమాల సందర్భంగా చేపట్టిన పనుల బిల్లులు చెల్లించాలి.. అని ఉత్తమ్ ఆ లేఖలో పేర్కొన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం పరిధిలో గత పనులకు రావాల్సిన బిల్లులను ఆయన లేఖలో పేర్కొన్నారు. ఆ జాబితాలోని కర్విరాల, వర్ధాపురం పంచాయతీలకు వివిధ పనులు నిమిత్తం రూ.15 లక్షల చొప్పున బిల్లులు పెండింగులో ఉన్నాయని ఉత్తమ్ పేర్కొనడం గమనార్హం.