రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో తీవ్ర విషాదం

రచ్చబండ : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీలో విషాదం చోటు చేసుకుంది. మున్సిపాలిటీ పరిధిలోని సోలిపురం శివారులోని ఓ నీటి గుంతలో పడి పదేళ్లలోపు వయసున్న చిన్నారులు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

షాద్ నగర్ పట్టణానికి చెందిన అక్షిత్ గౌడ్, ఫరీద్, ఫరీన్ సోమవారం ఉదయం ఆడుకోవడానికి తమ ఇళ్ల నుంచి బయటకు వెళ్లారు. సోలిపురం పరిధిలోని ఓ చోట వెంచర్ కోసం వేసిన స్థలంలో నీరు నిలిచి ఉంది. దానిలో చేపలు పట్టేందుకని దిగారు. ఈ క్రమంలో లోతు ఉండటంతో ఈత రాక మునిగి ముగ్గూరు అక్కడికక్కడే మృతిచెందారు.

చిన్నారుల కోసం వెతుకుతూ వచ్చిన వారి తల్లిదండ్రులకు నీటి గుంతలో తేలియాడుతూ వారి మృతదేహాలు కనిపించాయి. దీంతో వారంతా కన్నీరు మున్నీరుగా విలపించసాగారు. దాన్నుంచి వారి మృతదేహాలను వెలికి తీశారు. వారంతా పదేళ్లలోపు చిన్నారులే. ఈలోగా పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి విచారణ చేపట్టారు.