రచ్చబండ ప్రత్యేకం : తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏటేటా భక్తుల ఆదరణ పెరుగుతూ వస్తోంది. దానికి అనుగుణంగా ఆలయ ఆదాయమూ అంతకంతకూ పెరుగుతూ పోతోంది. ఆ మేరకు ఆలయ ట్రస్టు ఆధ్వర్యంలో వైదిక, సేవా, వితరణ కార్యక్రమాలూ విస్తరిస్తూ ఉన్నాయి. దీంతో ప్రపంచంలోనే అత్యంత జనాదరణ, ఆదాయం కలిగిన ఆలయంగా తిరుమల ప్రసిద్ధి చెందింది.
వేల ఏళ్ల నుంచి తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ఆదరణ అంతకంతకూ పెరుగుతూ ఉంది. ఏటేటా భక్తులు సంఖ్య పెరుగుతుండగా, అంతకంతకూ శ్రీవారికి కానుకలూ పెరుగుతూ వస్తున్నాయి. 110 ఏళ్ల క్రితం శ్రీవారి వార్షిక ఆదాయం రూ.3.50 లక్షలు వచ్చింది. అదే 2022 మొదటి నాలుగు నెలల్లో హుండీ ఆదాయమే రూ.500 కోట్లు దాటింది.
పల్లవ రాణి సామవై, శ్రీకృష్ణ దేవరాయలు, రాగోజి బొన్సలే, వెంకటగిరి రాజులు తిరుమల స్వామివారికి ఎన్నో విలువైన కానుకలు సమర్పించారు. ఎన్నోసార్లు ఎందరో అజ్ఞాత భక్తులు ఎంతో విలువైన కానుకలను స్వామివారికి సమర్పించారు.
1950 నుంచి ఏటేటా ఆదాయం వివరాలు
తిరుమల స్వామివారి హుండీ ద్వారా 1950లో రూ.2.26 లక్షల వార్షికాదాయం సమకూరింది. 1954లో రూ.5,35,703 వచ్చింది. అదే విధంగా 1960లో రూ.11,067, 1970లో రూ.33,094, 1980లో రూ.79.05 లక్షలు, 1990లో రూ.ఒక కోటికి పైగా, 2000 సంవత్సరంలో రూ.2.37 కోట్లు రాగా అదే 2020లో రూ.2.70 కోట్ల చొప్పున ఆదాయం సమకూరింది.
నెలకు 100 కిలోలకు పైగా బంగారం
శ్రీవారి హుండీలో నెలకు 100 కిలోలకు పైగా బంగారాన్ని భక్తులు కానుకగా సమర్పిస్తున్నారు. దీంతో ఏటా సుమారు 1,300 కిలోల పసిడి ఆలయ ఖాతాలో జమవుతుంది. ఇప్పటి వరకూ బ్యాంకులో డిపాజిట్లుగా 10 వేల కిలోలకు పైగా బంగారం ఉన్నట్లు సమాచారం.
ఈనెలలోనే రికార్డు స్థాయి హుండీ ఆదాయం
ఈనెల 4వ తేదీన తిరుమల స్వామివారి హుండీ ఆదాయం మునుపెన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో సమకూరింది. ఆ ఒక్కరోజే 77,907 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, రూ.6.18 కోట్ల ఆదాయం సమకూరింది. గతంలో 2012లో ఏప్రిల్ 1న రూ.5.73 కోట్ల ఆదాయం గత రికార్డుగా నమోదై ఉంది.
వందేళ్ల క్రితం వెయ్యి మంది భక్తులు
వందేళ్ల క్రితం తిరుమల శ్రీనివాసుడి ఆలయాన్ని రోజూ వెయ్యి మంది భక్తులు దర్శించుకునే వారు. అదే నేడు రోజుకు లక్ష మందికి పైగా భక్తులకు దర్శనభాగ్యం కలుగుతోంది. కరోనా కారణంగా 2019 నుంచి ఆలయానికి భక్తుల సంఖ్య కనిష్ఠ స్థాయికి పడి పోగా కొన్ని రోజులు ఆలయ దారులే మూతపడ్డాయి.
శ్రీవారికి 1,094 రకాల విలువైన ఆభరణాలు
తిరుమల శ్రీవారి ఆలయంలో దేవతామూర్తుల విగ్రహాలకు 1,094 రకాల విలువైన బంగారు, వజ్ర, వైడూర్యాలు, పచ్చల హారాలు ఉన్నాయి. వీటిలో 394 వజ్ర, వైడూర్యాలు ఉన్నాయి.
రూ.30 కోట్ల విలువైన వజ్రాల కిరీటం, రూ.5 కోట్ల వజ్రాల కటి, వరద హస్తాలు, రూ.3 కోట్ల బంగారు పీతాంబరం, రూ.3 కోట్ల బంగారు కిరీటం, రూ.75 లక్షల విలువైన నాగాంబరం ఉన్నాయి.
క్రీ.శ. 1740లో ఆనాడు రూ.33 వేల విలువ చేసే పచ్చల ముత్యాల హారం, 28 కిలోల వజ్ర కిరీటం, 19కిలోల బంగారు పీతాంబరం, 19 కిలోల శ్రీవారి బంగారు పద్మపీఠం, 35 కిలోల బంగారు మకర తోరణం, 32 కిలోల ఐదు సవర్ల బంగారు సహస్రనామ మాల, 10 కిలోల నాలుగు పేటల మెహరీల దండ చొప్పున ఉన్నాయి.