సర్పంచులలో ఈ సర్పంచ్ వేరయా

సర్పంచులలో ఈ సర్పంచ్ వేరయా
రచ్చబండ, శంకర్ పల్లి: సర్పంచులలో ఈ సర్పంచ్ వేరయా.. అని పాడుకుంటున్నారు, ఆ వూరే కాదు.. మండలం, పరిసర ప్రాంతవాసులు. అభివృద్ధి చేయడం చూశాం.. సంక్షేమ పథకాలు అందించడం విన్నాం.

ఒకసారి దానం చేసి వదిలేయడం విన్నాం. కానీ ఈ సర్పంచ్ నిరంతర సేవకు పునరంకితం అయ్యారు. అయన సేవకు జనమంతా జేజేలు పలుకుతూ.. మురిసిపోతున్నారు. ఆయనే శంకర్ పల్లి మండలం పొద్దుటూరు గ్రామ సర్పంచ్ ఏనుగు నరసింహారెడ్డి. అయన ఊరి జనం కోసం ఉదారతను చాటుకున్నారు.

పొద్దుటూరు గ్రామం నుండి హైదరాబాద్ పిడబ్ల్యుడి రోడ్డు గేటు వరకు గ్రామస్తులను చేరవేసేందుకు ఏర్పాటు చేసిన ఆటోను ఆదివారం ప్రారంభిచారు. అందులో గ్రామస్తులను ప్రతిరోజు ఉచితంగా పొద్దుటూరు గేటు వద్దకు, అక్కడి నుంచి పొద్దుటూరు గ్రామం వరకు ప్రజలను చేరవేస్తామని చెప్పారు.

ఈ సౌకర్యం కల్పించినందుకు గ్రామస్తులు సర్పంచ్ ను అభినందనలతో ముంచెత్తారు. ఇలాంటి ఉదార స్వభావం ఇప్పటివరకు మండలాల్లో ఎవరూ కల్పించలేదని కొనియాడారు. అయన సేవకు ఫిదా అవడం గ్రామస్తుల వంతయింది.