నిమ్మతోటలో దొంగలు పడ్డారు!

• 750 కిలోల నిమ్మకాయల చోరీ
• రైతుకు రూ.2.25 లక్షల నష్టం

ఇదేదో విచిత్రంగానే అనిపించినా నిజంగానే జరిగింది. మార్కెట్లో నిమ్మకాయల ధరలు విపరీతంగా పెరగడంతో కొందరు ఈ దొంగతనానికి పాల్పడ్డారు. ఒకరోజు కాదు.. వరుసగా మూడు రోజుల పాటు దొంగతనానికి పాల్పడటంతో ఆ రైతుకు అనుమానం వచ్చి తోటను పరిశీలించాడు. దీంతో అవాక్కవడం ఆయన వంతయింది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని శివదిన్ పూర్వా గ్రామ పరిధిలోని ఓ నిమ్మతోటలో ఇటీవలే ఈ చోరీ జరిగింది. వరుసగా 3రోజుల పాటు సుమారు 15 వేల నిమ్మకాయలను దొంగలు చోరీ చేశారు.

వాటి బరువు సుమారు 750 కిలోలని, ఒక్కో కిలో రూ.300 పలుకుతోందని రైతు తెలిపాడు. ఈ లెక్కన వాటి ధర ఎంతో తెలుసా. దొంగల కారణంగా ఆ రైతు రూ.2.25 లక్షలు నష్టపోయాడు. దీంతో ఆ రైతుతో పాటు ఇతర సమీప తోటల రైతులు కాపలా ఉంటూ నిమ్మకాయలను కాపాడుకుంటున్నారు.