గతంలో ఊరూరా పరదా సినిమాలు చూసేవాళ్లం. చుట్టూ డేరాలేసి లోపల వెండితెర వేసి సినిమాలు ప్రదర్శించేవాళ్లు. కొన్నిచోట్ల టూరింగ్ టాకీసులు అనేవారు. రానురాను అవి కనుమరుగయ్యాయి.
కాలక్రమేణా పెద్ద పెద్ద సినిమా హాళ్లు, 70 ఎంఎం, అత్యాధునిక డిజిటల్ సిస్టమ్ తో కూడిన థియేటర్లు వేలిశాయి. అవన్నీ పట్టణాలు, నగరాలకే పరిమితమయ్యాయి. దీంతో పల్లె వాసులు ఆయా చోట్లకు వెళ్లి సినిమాలు చూడాల్సి వస్తోంది.
కానీ పాతనాటి కాలం మళ్లీ వచ్చేస్తోంది. ఎక్కడ పడితే అక్కడే సినిమాలు ప్రదర్శించే మొబైల్ థియేటర్లు రానే వచ్చాయి. ఎక్కడో కాదు.. మన సమీపంలోకీ వచ్చాయి. సినిమా ప్రదర్శన అనంతరం చాప చుట్టేసినట్టే చుట్టేసి ట్రక్కుల్లో మరో చోటుకు తీసుకెళ్లే అవకాశముంది. ఇక ఊరూరా సినిమాలు చూసే అవకాశం వచ్చినట్లే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజానగరం వద్ద జాతీయ రహదారి పక్కన హాబిటేట్ ఫుడ్ కోర్టు ఉంది. దాని ప్రాంగణంలో మొబైల్ థియేటర్ ఏర్పాటు చేస్తున్నారు. వెదర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్ పద్దతుల్లో వేసిన టెంటులో టెక్నాలజీతో గాలి నింపుతారు. 120 సీట్ల కెపాసిటీతో ఏసీ థియేటర్ ను రూపొందిస్తున్నారు.
పిక్చర్స్ డిజిటల్స్ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొల్పుతున్న మొబైల్ థియేటర్లలో ఇదే మొదటిది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాతో ఈ థియేటర్ ప్రారంభమవుతుందని ప్రతినిధులు తెలిపారు.