- పిల్లలు కలగాలని ఓ కుటుంబం మూర్ఖత్వం (వీడియో)
రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతరిక్ష మూలాల అంతు తెలుసుకొనే ఈ రోజుల్లో కొందరు మూఢత్వంతో కళ్లు మూసుకుపోయి అథ:పాతాలానికి దిగజారిపోతున్నారు. నేటి సమాజంలో కొందరు మూఢత్వంతో చెప్పే మాటలు నమ్మి ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. అలాంటి కోవకు చెందినదే ఈ ఘటన. హిందీలో మాట్లాడే ఈ వ్యక్తుల సంభాషణను బట్టి మనదేశంలోనే ఉత్తరాదిలో జరిగినట్టు అంచనా.
దానిలో ఉన్న విషయమేమిటంటే.. ఒక ఊరి సమీపంలోని ఓ మురికి గుంతలో ఓ యువతి బందీగా పడుకొని ఉంది. ఓ ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చి ఆమెను కాళ్లు, చేతులకు ఉన్న తాళ్లను తొలగించి నీటి నుంచి బయటకు తీసుకొస్తారు. ఎందుకు ఇలా చేశారమ్మా.. అని వారడిగితే ‘అన్న పానీయాలు లేకుండా ఇలా నీళ్లల్లో 11 రోజులు పడుకొని ఉంటే పిల్లలు కలుగుతారట. ఒక స్వామీజీ చెప్పారని నాతో ఇలా చేయిస్తున్నారు. ఇప్పటికి వారం రోజులుగా ఇలా చేయించారు.’’ అని దు:ఖిస్తూ ఆ యువతి చెప్పుకొచ్చింది. అయితే దీన్ని గమనించిన ఆ యువతి అత్త హుటాహుటిన అక్కడికి చేరుకొని ఆ ఇద్దరిని దూషిస్తూ ఆ యువతిని మళ్లీ నీటిలోకి తోసేసింది. ఆమెను అడ్డగించి ఆ యువతికి రక్షణగా నిలుస్తారు.
ఈ లోగా ఆ యువతి భర్త వస్తాడు. ఆ యువతిని దౌర్జన్యంగా నీటిలోకి తోసేస్తాడు. ఆ ఇద్దరు వ్యక్తులు ఆ యువతి భర్తపై దాడి చేస్తారు. మూర్ఖత్వాన్ని ప్రశ్నిస్తారు. ఇలా చేయడం మీకు భాగ్యమేనా, ఆ యువతి ప్రాణాలు పోతే ఎవరు బాధ్యులు అని నిలదీస్తారు. వారి ఎదుటే ఆ యువతిని ‘ఇలా చేయడం నీకిష్టమేనా’ అని అడిగితే తనకిష్టం లేదని ఆ యువతి చెప్పడం గమనార్హం.
ఆ యువతికి ఇష్టం లేకపోయినా మీరిలా చేయించడం భావ్యమేనా అని వారు ప్రశ్నిస్తే ఆ యువతి అత్త ఇచ్చిన సమాధానం విచిత్రంగా ఉంది. ‘టుంబం కోసం ఆ మాత్రం చేయదా? మా వంశం నిలబడేందుకే ఇలా చేయిస్తున్నాం. మీకెందుకు’ అంటూ ఎదురు ప్రశ్నించడం ఆమె మూర్ఖత్వానికి పరాకాష్ట.
ఇలాంటి సంఘటనలతో కాలం ఎటుపోతున్నదో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ఇంకా మూఢత్వంతో కూడిన భక్తి విశ్వాసాలను నమ్మేవారున్నారనడానికి ఇదే నిదర్శనం. ఇలాంటి మూఢనమ్మకాలు మనుషుల్లో పూర్తిగా ఎప్పుడు తొలిగిపోతాయో అప్పడు ఆధునిక సమాజం ఆవిర్భవించినట్టు..
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఉన్నది చూడగలరు.