- డాక్టర్ల నిర్లక్ష్యంతో మృతి చెందాడని బంధువుల ఆరోపణ
రచ్చబండ, ఆమనగల్లు : రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో బుధవారం రాత్రి ఆపరేషన్ వికటించి యువకుడు మృతి చెందాడు. తలకొండపల్లి మండల పరిధి రాంపూర్ గ్రామానికి చెందిన మాధ నరేశ్ రెడ్డి అనే యువకుడు అపెండిక్స్ నొప్పితో ఆ హాస్పిటల్ లో చేరడం జరిగింది.
బుధవారం రాత్రి ఆ యువకుడికి వైద్యులు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ వికటించడంతో హైదరాబాద్ బీఎన్ రెడ్డి నగర్ లోని ఓ హాస్పిటల్ కు తరలించగా యువకుడు చనిపోవడం జరిగింది.
యువకుడి మృతికి కారణమైన ఆమనగల్లులోని ఆ హాస్పిటల్ ను వెంటనే మూసివేసి తగు చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు, రాంపూర్ గ్రామ ప్రజలు ఆమనగల్లులోనే హాస్పిటల్ ముందు మృతదేహంతో ధర్నా చేపట్టారు. స్థానిక సీఐ ఉపేందర్, ఎస్ఐ సుందరయ్య ఆయా పరిస్థితులను సమీక్షించారు.
ఈ సంఘటనా స్థలానికి ఎఐసీసీ కార్యదర్శి, కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు చల్లా వంశీచంద్ రెడ్డి, తలకొండపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు డోకూరి ప్రభాకర్ రెడ్డి వచ్చి నరేష్ రెడ్డి తల్లి తండ్రులను ఓదార్చారు.