నియంత పాలన సాగిస్తున్న కేసీఆర్ సర్కార్
– వైఎస్ఆర్టిపి కల్వకుర్తి నియోజకవర్గం ఇంచార్జ్ చీమర్ల అర్జున్ రెడ్డి
రచ్చబండ, ఆమనగల్లు: వైఎస్ఆర్టిపి అదినేత్రి వైయస్ షర్మిల అక్రమ అరెస్టును నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపాలిటీ కేంద్రంలో ఆ పార్టీ కల్వకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి చీమర్ల అర్జున్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ప్రధాన రహదారిపై నిరసన ర్యాలీ నిర్వహించి, సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.అనంతరం ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. టిఎస్పిఎస్సి ప్రశ్నాపత్రం లీకేజీ విషయంలో సిట్ కు ఫిర్యాదు చేయడానికి వెళుతున్న షర్మిలను అడ్డుకొని అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విలువలను కాల రాయడమేనని అర్జున్ రెడ్డి మండిపడ్డారు.
30 లక్షల మంది విద్యార్థుల కుటుంబాల జీవితాల కడుపుకోతపై ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడుతున్న షర్మిలపై రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పోలీసులచే తప్పుడు కేసు నమోదు చేయించి జైలుకు పంపడం ఎంతవరకు సమంజసం అని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం కొనసాగుతుందని అర్జున్ రెడ్డి ధ్వజమెత్తారు. నియంత పాలన సాగిస్తున్న కేసీఆర్ సర్కార్ ను అంతమొందించే వరకు వైఎస్సార్ తెలంగాణ పార్టీ పోరాడుతుందని ఆయన పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ ప్రభుత్వం విపక్షాల గొంతు నొక్కుతుందని, ప్రజా సమస్యలు వెలుగులోకి రాకుండా అడ్డుపడుతుందని అర్జున్ రెడ్డి ఆరోపించారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. వైయస్సార్ టిపి నాయకులు నరేష్ శ్రీను రాజు ఫిరోజ్, కృష్ణ ,రాకేష్ ,పవన్, జగన్ ,వెంకట్ ,రమేష్, తదితరులు పాల్గొన్నారు.