టికెట్ రాకున్నా ప్రచార రథాలను సిద్ధం చేసిన సూర్యాపేట హస్తం నేత
రచ్చబండ, సూర్యాపేట: అసెంబ్లీ టిక్కెట్ల పరిశీలనే జరగలేదు.. అసలు టికెట్ వస్తుందో రాదో తెలియదు.. కానీ సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ నేతకు మాత్రం గట్టి భరోసా ఉన్నట్టుంది. ఏకంగా ప్రచార రథాలనే సిద్ధం చేయడమే కాదు.. పూజలే చేయించి రెడీ అయి ఉన్నాడు. ఎప్పుడు టికెట్ ప్రకటిస్తారా అప్పటి నుంచి ప్రచారం షురూ చేయాలన్నంతగా సంసిద్ధమై ఉన్నాడు.
ఆయన ఎవరో కాదు.. కాంగ్రెస్ రాష్ట్ర నేత, టీపీపీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వర్గం నేతగా ముద్ర పడిన పటేల్ రమేష్ రెడ్డి. అయన ప్రత్యేకంగా తయారు చేయించిన ప్రచార రథాలకు గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద పూజలు నిర్వహించారు. ఎన్నికల క్షేత్రంలోకి దిగి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో దిగ్విజయంగా ప్రచారం చేసి, విజయం సాధించాలని పూజారులు, పెద్దలు, శ్రేయోభిలాషులు రమేష్ రెడ్డిని ఆశీర్వదించారు.
ఈ నేపథ్యంలో పటేల్ రమేష్ రెడ్డికి టికెట్ దక్కుతుందా? లేదా మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్ రెడ్డికే మళ్ళీ అధిష్టానం టికెట్ ఇస్తుందేమో వేచి చూడాలి మరి.