సర్పంచులు ఐదేండ్లలో గ్రామాలను అద్భుతంగా తీర్చిదిద్దారు!
*రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి
రచ్చబండ, శంకర్ పల్లి: సర్పంచులు తమ ఐదు సంవత్సరాల పదవీకాలంలో గ్రామాలలో అద్భుతమైన అభివృద్ధిని చేశారని రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి కొనియాడారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో సర్పంచులతో చివరి మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ సర్పంచులు ఐదు సంవత్సరాలుగా తమ గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించారని తెలిపారు. ఏ గ్రామంలో చూసిన సిసి రోడ్లు, అండర్ డ్రైనేజ్ మురికి కాలువలు అభివృద్ధి బాగా జరిగిందని చెప్పారు. తమ గ్రామాల రోడ్లకు ఇరువైపులా పచ్చని చెట్లు పెంచడంతో గ్రామానికి కొత్త శోభ తెచ్చారని తెలిపారు. అందుకు అధికారులు కూడా సహకరించారని చెప్పారు.
గ్రామ కార్యదర్శులు కూడా గ్రామాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలిపారు. కాగా ఇటీవల మండలంలోని మోకిలా గ్రామపంచాయతీ కార్యదర్శి సస్పెండ్ విషయం మండల అధికారులు తనకు ముందుగా తెలుపకపోవడం శోచనీయమని అన్నారు. మండలంలోని మిర్జాగూడ అనుబంధ గ్రామమైన ఇంద్రారెడ్డి నగర్ లో ఇప్పటివరకు మిషన్ భగీరథ నీరు రాకపోవడం విచారకరమని ఆ గ్రామ సర్పంచ్ గౌండ్ల రవీందర్ గౌడ్ అన్నారు. పది రోజులైతే తమ సర్పంచ్ పదవి కాలం ముగిసిపోతుందని తెలిపారు. అధికారులు ఇంద్రారెడ్డి నగర్ కాలనీకి భగీరథ నీరు అందేలా చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని అన్నారు. కాగా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందని, తాను స్వయంగా విద్యా వాలంటీర్లను ఏర్పాటు చేసి పిల్లలకు విద్యాబోధన కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నానని తెలిపారు.
ఇంద్రారెడ్డి నగర్ లో పూర్తిస్థాయి అంగన్వాడి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఇరిగేషన్ అధికారులు తమ గ్రామ శివారులో జరుగుతున్న కాలువలకు సరైన సర్వే జరపడం లేదని ఆ గ్రామ సర్పంచ్ ఏం నరసింహారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడి కేంద్రాలకు సరఫరా గుడ్లు నాసిరకంగా ఉన్నాయని అవి పిల్లలు తినే రకంగా లేవని అధికారులు దృష్టికి తీసుకువచ్చారు.
ఐదు సంవత్సరాలు కావస్తున్న తమ గ్రామాలలో విద్యుత్ కష్టాలు తీయడం లేదని మహారాజ్ పేట్, టంగుటూరు, లక్ష్మారెడ్డి గూడ, గాజుల గూడ, ఎరువా గూడ గ్రామాలకు చెందిన సర్పంచ్ ను దోసాడ నరసింహారెడ్డి, గోపాల్, ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ లు అధికారుల దృష్టికి తెచ్చారు. విద్యుత్ సిబ్బంది కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారని వాపోయారు, తమ గ్రామాలలో విద్యుత్ స్తంభాలు, ఆన్ ఆఫ్ స్విచ్లు ఏర్పాటు చేయడం లేదని తెలిపారు. రేషన్ షాపులలో కిరోసిన్, చక్కెర ఎందుకు ఇవ్వడం లేదని సభ్యులు తాసిల్దార్ సురేందర్ ను ప్రశ్నించారు.
ప్రభుత్వం నుండే అవి సరఫరా కావడం లేదని తహసీల్దార్ సభ్యులకు జవాబు ఇచ్చారు. మండలంలో ప్రభుత్వం ఆయిల్ ఫామ్ తోటలో ఏర్పాటుకు 200 ఎకరాలు టార్గెట్ చేసిందని, రైతులు ప్రభుత్వము నుండి ఈ పంటకు వచ్చే సబ్సిడీని సద్వినియోగం చేసుకొని ఆయిల్ ఫామ్ తోటలను సాగు చేయాలని మండల వ్యవసాయ అధికారి సురేష్ బాబు తెలిపారు.
ఈ సమావేశంలో జడ్పిటిసి చేకూర్త గోవిందమ్మ గోపాల్ రెడ్డి, స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాపారావు, ఎంపీడీవో వెంకయ్య, ఎంపీ ఓ గీత, ఏపీ నాగభూషణం, ఏపిఎం భీమయ్య, ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ రేవతి రెడ్డి, ఎంఈఓ సయ్యద్ అక్బర్, ట్రాన్స్కో అధికారి, ప్రదీప్ వర్మ, యుగంధర్ రాజు, సూపరిండెంట్ రవీందర్, గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.