ఆర్ఆర్ఆర్ సినిమా మేనియా!

హైదరాబాద్ : ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా సినిమా భారీ అంచనాలు, అభిమానుల కోలాహాలం నడుమ ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా నిర్మాణ సంస్థకు ఉన్న ఆతృతతో పాటు అభిమానుల్లోనే కాదు.. సినిమా జనాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. దర్శక దిగ్గజుడు ఎస్ఎస్ రాజమౌళి, టాలీవుడ్ అగ్రహీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలయికతో వచ్చిన ఈ సినిమాపై యావత్ ప్రపంచం ఎన్నాళ్ల నుంచో ఉత్సుకతతో ఎదురుచూసింది. ఇక ప్రేక్షకుల ముంగిటకు వచ్చిన ఈ భారీ సినిమా ఎలా ఉన్నా.. చాలా విషయాల్లో భారీతనం కనిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

* ఆర్ఆర్ఆర్ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో రూపుదిద్దుకుంది.
* ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు 80 వేల షోలతో ఈ సినిమా విశ్వరూపం ప్రదర్శించింది.
* ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 11,000కు పైగా థియేటర్లలో విడుదలైంది.
* అమెరికా దేశంలో 2,500 స్క్రీన్లలో ఈ సినిమా రిలీజైంది.
* బ్రిటన్ దేశంలో 1,100 స్క్రీన్లలో విడుదలైంది.
* మిగతా అన్ని దేశాల్లో 2,000 థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది.
* మనదేశంలో ఉత్తరాదిలో 3,000 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేశారు.
* రెండు తెలుగు రాష్ట్రాల్లో 1,500 థియేటర్లలో విడుదలై అభిమానుల కోలాహాలం సృష్టించింది.
* తమిళనాడులో 400, కర్నాటకలో 350, కేరళలో 250 థియేటర్లలో ఆర్ఆర్ఆర్ సినిమా విడులైంది.

బాహుబలి-2 రికార్డు బద్దలు కొడుతుందా?
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలోనే ఇంతకు ముందు వచ్చిన బాహుబలి-2 సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించి రూ.1,810 కోట్లను ఆర్జించి ప్రపంచంలోనే నెంబర్వన్ తెలుగు సినిమా స్థాయికి వెళ్లింది. మరి భారీ అంచనాతో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా బాహుబలి-2 రికార్డును బద్దలు కొట్టాలనే అంచనాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అది జరగాలంటే ఆర్ఆర్ఆర్ సినిమా రూ.2,000 కోట్ల భారీ రాబడిని సాధించాలి. మరి అది సాధ్యమవుతుందా.. అన్న విషయం మూడురోజుల తర్వాత నుంచి వెల్లడవుతుంది.

కలెక్షన్ల వర్షం
భారీ బడ్జెట్ నిర్మితమై, భారీ అంచనాతో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా మొదట్లో అయితే కలెక్షన్ల వర్షం కురిపించింది. తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల వరకు టికెట్ల రేట్లు పెంచుకునేందుకు ఆయా ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. దీంతో పెరిగిన ధరలతో ఒక్కరోజులోనే రూ.40 కోట్ల వరకు అదనపు కలెక్షన్లు రానున్నాయి. మొదటిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల మార్క్ ను దాటినట్లు అంచనా.

ఒక్క తెలంగాణలోనే..
ఒక్క తెలంగాణలోనే మొదటిరోజు హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో 1,217 ఆటల ద్వారా 4,05,178 ప్రేక్షకుల నుంచి రూ.11,94,55,996 ఆదాయం సమకూరింది. ఆక్యుపెన్సీ రేట్ 88 శాతం.

అమెరికాలో ఫస్ట్ డే..
అమెరికా దేశంలో తొలిరోజు ఆర్ఆర్ఆర్ సినిమా రూ.22 కోట్ల బెంచ్ మార్క్ ను దాటేసినట్లు అంచనా. అర్ధరాత్రి దాటాక ఇంకా పెరిగే అకాకాశముందని అంచనా. మొదటిరోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియా సినిమాగా ఇది నిలిచింది.