నాలుగో తరగతి బాలికపై వాచ్ మెన్ లైంగిక దాడి.. స్కూల్ బాత్ రూంలోనే దారుణం

రచ్చబండ ఆన్ లైన్ ప్రతినిధి : అభం శుభం తెలియని చిన్నారులపై కామాంధుల వికృత చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్ని పకడ్బందీ చట్టాలు వచ్చి, ఎందరికో శిక్షలు పడుతున్నా కామ పిశాచాలు జడలు విప్పతూనే ఉన్నాయి. మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా జరిగిన ఓ దారుణం సభ్య సమాజానికే తలవంపుగా మారింది.

మధ్య ప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరమైన భోపాల్ లోని కోహెఫిజా ప్రభుత్వ స్కూలులో ఓ విద్యార్థిని నాలుగో తరగతి చదువుతోంది. మధ్యాహ్న భోజన సమయంలో ఆ చిన్నారి ఆ స్కూల్ లోని టాయ్ లెట్ కు వెళ్లింది.

గమనించిన ఆ స్కూల్ వాచ్ మెన్ లక్ష్మీనారాయణ్ మెల్లిగా వెళ్లి ఆ బాలికపై బాత్ రూములోనే లైంగికదాడికి తెగబడ్డాడు. ఆ తర్వాత సదరు బాలిక ఏడ్చుకుంటూ వెళ్లి టీచర్లకు జరిగిన దారుణాన్ని చెప్పింది.

ఈ మేరకు పాఠశాల ఉపాధ్యాయులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే నిందితుడిని అరెస్టు చేసి కేసు విచారణ జరుపుతున్నారు.

ఇలాంటి దారుణాలు నిత్యకృత్యం కావడం ఆందోళనకరం. బడికి వెళ్లిన చిన్నారులు సైతం క్షేమంగా ఇంటికి తిరిగొస్తారా, లేదా అన్న విషయం తల్లిదండ్రుల్లో భయాన్ని గొల్పుతుంది.