తెలంగాణలో మరో జిల్లా ఏర్పాటు ఆవశ్యకత? కేసీఆర్ పరిశీలనలో ఉందా!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఉన్న 10 జిల్లాల నుంచి నేటి వరకు ప్రభుత్వం 33 జిల్లాలను విభజించింది. మండలాల సంఖ్యను పెద్ద మొత్తంలో ఏర్పాటు చేసింది. తాజాగా 13 మండలాలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ దశలో జిల్లా ఏర్పాటుకు అవకాశమున్న మరో ప్రాంతం చర్చనీయాంశంగా మారింది.

జిల్లాల పునర్విభజనలో జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడానికి అర్హత కలిగిన పట్టణంగా మిర్యాలగూడకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. కానీ పాలకుల వివక్ష, స్థానిక ప్రజాప్రతినిధుల బలహీనత, అధికారుల అలసత్వం వెరసి జిల్లాకు నోచుకోలేదు. కానీ అన్ని అర్హతలూ ఉన్న మిర్యాలగూడ కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రజల నుంచి బలంగా వినిపిస్తున్న డిమాండ్ మాత్రం సజీవంగానే ఉంది. ఇప్పటికీ అక్కడి ప్రజా సంఘాలు, మిర్యాలగూడ లవర్స్ మాత్రం ఆ డిమాండును చేస్తూనే వస్తున్నారు.

అత్యధిక మండలాలున్న జిల్లా
మిర్యాలగూడ పట్టణం నల్లగొండ జిల్లాలో భాగంగా ఉంది. రాష్ట్రంలోనే అత్యధిక మండలాలున్న జిల్లాగా నల్లగొండను విభజించారు. జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లతో తాజాగా ఏర్పడిన గట్టుప్పల్ సహా 32 మండలాలు ఉన్నాయి.

ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు నల్లగొండ జిల్లాలోనే 90శాతం వరకు విస్తరించి ఉంది. అదే విధంగా వైశాల్యం రీత్యా, జనాభా రీత్య పెద్ద జిల్లాల్లో నల్లగొండ మొదటి వరుసలో ఉంటుంది.

ఆయా పరిస్థితులను బట్టి నల్లగొండ జిల్లాను ఎట్టి పరిస్థితుల్లో రెండుగా విడగొట్టాల్సిన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి వస్తే మిర్యాలగూడ కేంద్రంగా మూడు అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపి నూతన జిల్లాగా ఏర్పాటు చేయాల్సి ఉంది.

కేసీఆర్ మదిలో ఉందా?
తాజాగా మండలాల విభజన సమయంలో, గతంలో కూడా మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు విషయమై ధైర్యంగా ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా డిమాండ్ చేసిన దాఖాలాలు లేవు. దీంతో ప్రభుత్వం వద్ద మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు విషయం ప్రస్తావన లేకుండా పోయింది. మొదటి నుంచి మిర్యాలగూడ జిల్లా కావాలనే అవసరం మాత్రం అందరిలో ఉంది.

ఇదే అంశం సీఎం కేసీఆర్ మదిలో కూడా ఉంది. గతంలో ఒకటి రెండు సార్లు ఉన్నతాధికారుల వద్ద సీఎం కేసీఆరే మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు అంశంపై లేవనెత్తినట్లు విశ్వసనీయ సమాచారం.

జిల్లా కల నెరవేరే అవకాశం
ఈ అంశంపై కేసీఆర్ వద్ద ఇక్కడి ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేయకపోవడం, ప్రజలు పోరుబాటను ఎంచుకోకపోవడంతో ఆ ఆశ నిర్జీవమై పడి ఉంది. కానీ ఇప్పటికైనా ఈ ప్రాంత ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మిర్యాలగూడ లవర్స్ పోరాట పంథాను ఎంచుకుంటే జిల్లా కల నెరవేరే అవకాశం మెండుగా ఉంది. అనుకున్న ప్రాంతాలను, ఎవరూ ఊహించని ప్రాంతాలను జిల్లాలుగా, మండలాలుగా విభజించిన ప్రభుత్వం అర్హత కలిగిన మిర్యాలగూడను కూడా జిల్లాగా ఏర్పాటు చేస్తుంది. ఒకేఒక్క నియోజకవర్గాన్ని సైతం జిల్లాగా చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

నాలుగు నియోజకవర్గాలతో ఏర్పాటుకు అవకాశం
మిర్యాలగూడ, నాగార్జున సాగర్, దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు అవసరమైతే సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని సైతం కలిపి మిర్యాలగూడ కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయొచ్చు. దీనికి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం అయ్యే అవకాశం లేదు.

ఐక్య పోరాటానికి దిగాలి
తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కీలక భూమిక పోషించిన మిర్యాలగూడ మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరమెంతైనా ఉంది. జేఏసీగా ఏర్పడి మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు కోసం పోరాడితే ప్రజలంతా కదిలొచ్చే అవకాశముంది. ఈ తరుణంలో పోరాటానికి దిగితే ఎన్నికలకు ముందే జిల్లా ఆవిర్భావం జరిగే అవకాశముంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం సానుకూలంగా వ్యవహారించనుంది.

ఎన్నికల సమయంలో ప్రజలంతా ఒత్తిడి తీసుకొస్తే ప్రభుత్వం దిగొచ్చే అవకాశముంది. అందుకు ఇప్పటి నుంచే నడుం బిగించాల్సిన తరుణం ఇదేనని నా అభిప్రాయం. దీనికోసం తెలంగాణ పోరాటంలో కీలక భూమిక పోషించిన వారేదీనికనడుం కట్టాలి. వినతుల మొదలై ఉద్యమం స్థాయికి చేరితే విజయం తథ్యం.

– బొమ్మకంటి బిక్షమయ్య,
9705347798