మ్యావ్ మ్యావ్ పిల్లి.. పోలీసులొచ్చారండి!

అర్ధరాత్రి 12గంటల సమయం.. అందరూ గాఢనిద్రలో ఉంటారు. అది కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయం.. ఆ సమయంలో పోలీసులకు ఓ కాల్ వచ్చింది. ఏదో సంఘటన జరిగి ఉంటుందేమోనని పోలీసులకు ఉత్కంఠగా ఉంది. ఆ సమయంలో సీపీ తన కార్యాలయంలోనే ఉన్నారు. దీంతో వెంటనే ఆయన ఫోన్ కాల్ ఎత్తారు.

ఆ ఫోన్ చేసిన వ్యక్తి సీపీకి చెప్పిన విషయాలు వింటే ఎవరికైనా చిర్రెత్తుకొస్తుంది. కానీ ఆయన బాధ్యతగా వ్యవహరించారు. ఆ కాలర్ ఏమన్నాడంటే.. ‘‘సార్.. మా ఇంటిలో ఉన్న బావిలో పిల్లి పడిపోయింది. అది ఒకటే అరుస్తున్నది.. దానిని కాపాడడానికి సహాయం చేయండి.’’ అని ఆ వ్యక్తి సీపీని కోరాడు.

రోజంతా పని ఒత్తిడితో ఉన్న పోలీసులు రాత్రి కాస్తంత సేదతీరుతారు. ఆ సమయంలో ఆ ఫోన్ కాల్ రావడంతో వారు విసుగు చెందే అవకాశం ఉంటుంది. కానీ అలా కాకుండా సీపీ చొరవ తీసుకొని టౌన్ ఏసీపీకి ఆదేశాలు జారీ చేశారు. కాలర్ తో అత్యవసరంగా మాట్లాడి ఆ పిల్లిని కాపాడాలని ఆదేశించారు.

వెంటనే అక్కడికి పోలీస్ రెస్క్యూ బృందం చేరుకుంది. బావిలోకి ఒక బుట్టను తాడు సహాయంతో పంపించి, ఆ బుట్టలో పిల్లి కూర్చునేలా ప్రయత్నించారు. పిల్లి ఆ బుట్టలో కూర్చున్న తర్వాత దాన్ని సురక్షితంగా పైకి లాగా పిల్లిని కాపాడారు. ఇదండీ సంగతి..